మైండ్ యువర్ ‘బిజినెస్’! గుజరాత్‌ని ఓడగొట్టిన ఏపీ..!

సులభతర వాణిజ్యంలో దేశంలోనే మొదటి స్థానం సాధించి మళ్ళీ కాలర్ ఎగరేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. డీఐపీపీ ప్రకటించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ రాష్ట్రాల ర్యాంకుల జాబితాలో ఏపీకే కిరీటం దక్కింది. తర్వాతి స్థానాల్లో తెలంగాణ, హర్యానా, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలు నిలిచాయి. సంస్కరణల అమలులో దాదాపు వందశాతం మార్కులు సాధించిన నాలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, ఝార్ఖండ్, గుజరాత్. 95 శాతం కంటే ఎక్కువ సంస్కరణలు అమలు చేసిన 9 రాష్ట్రాలను టాప్ అచీవర్స్ గా గుర్తించారు. వీటిలో ఏపీ స్కోర్ అధికంగా వుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌, నిర్మాణరంగ అనుమతుల్లో రాజస్థాన్‌, కార్మిక చట్టాల్లో బంగాల్‌, ఐటీ పారదర్శకతలో మహారాష్ట్ర.. ఇలా ఒక్కో విభాగంలో ఒక్కో రాష్ట్రం ముందుంటే.. అత్యధిక సగటు సాధించిన ఏపీకి ఫస్ట్ ప్లేస్ దక్కింది. గతంలో 19వ ర్యాంకు సాధించిన ఢిల్లీ ఇప్పుడు 23వ స్థానానికి దిగజారింది. గుజరాత్ వెలిగిపోతోందన్న నినాదం వీగిపోగా.. దక్షిణాది రాష్ట్రాలు సత్తా చాటడం, రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానాల్లో నిలవడం.. ఈసారి కీలకాంశాలు.

రెడ్ టేపిజం, అవినీతి లేని పూర్తి పారదర్శకతతో కూడిన విధానాల్ని అమలు చేయడం వల్లే తాము ఈ ఘనత సాధించామని ఏపీ ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. ఇది పూర్తిగా చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందని ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ కుటుంబరావు అంటున్నారు. మొట్టమొదటి సారిగా యూజర్ ఫీడ్ బ్యాక్ తీసుకుని తయారు చేసిన ఈ జాబితాలో ఏపీ అగ్రభాగాన నిలవడం అరుదైన విషయమన్నారు. 2017లో ప్రకటించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఇదొక గర్వకారణమంటూ అప్పట్లో కేసీఆర్ సర్కార్ కి జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు అదే క్రెడిట్ ఏపీకి దక్కినట్లయింది.

READ ALSO

Related News