చిరూని కలిసిన ఏపీ మంత్రి

మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ నటుడు చిరంజీవిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కలిశారు. హైదరాబాద్‌లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లిన ఆయన, చిరుకి కృతజ్ఞతలు చెప్పారు. చిరంజీవి గతంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరుకు) తన ఎంపీ నిధుల నుంచి రూ.5 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు తలపెట్టారు. ఆ పనుల యొక్క పురోగతిని ఇప్పుడు చిరుకు రవీంద్ర వివరించారు.

మచిలీపట్నం ఎమ్మెల్యే కూడా అయిన రవీంద్ర చిరంజీవిని స్వయంగా కలిసి, మరో ఏడాదిలోగా మిగిలిన పనుల్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఎంపీ నిధులు తమ నియోజకవర్గానికి కేటాయించినందుకు నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధి పనులు తనకు చాలా సంతోషాన్నిస్తున్నాయని చెప్పారు. ఎంపీ లాడ్స్ కింద తాను కేటాయించిన నిధులతో ప్రారంభించిన పనులు విజయవంతంగా సాగడం ఆనందాన్ని ఇస్తుందని చిరు అన్నారు.

Related News