ఆంధ్రావని నుంచి అమెరికా వరకు ప్రకృతి సేద్యం

ఆంధ్రావని పసిడి నేలపై అంకురించిన ‘ప్రకృతి సేద్యం’ అంతర్జాతీయ వేదికపై వేళ్లూనుకోనుంది. ఈనెల 25వ తేదీ తెల్లవారుజాము 3 గంటలకు (భారత కాలమానం) న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సదస్సులో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రసంగం చేయనున్నారు.

ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి బృందం ఈనెల 23 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనుంది.  ఇందులో భాగంగా అనేక ద్వైపాక్షిక, బృంద సమావేశాల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఈ (22వ తేదీ) రాత్రి 10 గంటలకు ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ నుంచి బయల్దేరి అమెరికాకు బయలుదేరింది. అమెరికా పర్యటనకు బయలుదేరుతున్న చంద్రబాబుకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ తెలుగుదేశం నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చివీడ్కోలు పలికారు.

చంద్రబాబు అమెరికా టూర్ షెడ్యూల్ ఇలా ఉంది..

తొలిరోజు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్‌తో సమావేశమవుతారు. ఆ తరువాత ఇంటలిజెంట్ ఎడ్జ్, అరూబా నెట్‌వర్క్స్ (హెచ్‌పీఈ బిజినెస్ యూనిట్) వ్యవస్థాపకుడు కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో సమావేశం అవుతారు. తరువాత న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌జేఐటీ) స్టూడెంట్ సెనేట్‌కు వెళతారు. అదేరోజు ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో విస్తృత సమావేశం వుంటుంది.

 

రెండోరోజు సముద్ర గర్భంలో నిక్షిప్తమైన సంపదను కనుగొనే సాంకేతిక పరికరాల తయారీ సంస్థ-‘మడోయర్ మెరైన్’ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. తరువాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ PHUMZILE MLAMBO-NGCUKAతో భేటీ అవుతారు. రిటైల్ బ్యాంకింగ్ సంస్థ ‘బీఎన్‌పీ పరిబాస్’ ఛీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ జీన్ లారెంట్ బొన్నాఫే (JEAN-LAURENT BONNAFE)తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ (JIM YOUNG KIM)తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రాక్ ఫెలర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ షాను కలుస్తారు. ఆ తరువాత వరసగా ద్వైపాక్షిక సమావేశాలు వుంటాయి. యుఎన్ ఎన్విరాన్‌మెంట్ ఎరిక్ సోలీమ్ (ERIK SOLHEIM)తో సమావేశం తరువాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే కీలక సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిదిమందిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరు.

Related News