ఢిల్లీలో చంద్రబాబు భావోద్వేగం

మోదీ సర్కార్‌పై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో వీగిపోవడం.. ఈ సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగిపోయింది. దీంతో నిన్న రాత్రే అమరావతిలో అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మోదీతీరును ఎండగట్టిన చంద్రబాబు, ఈ ఉదయం హుటాహుటీన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న వెంటనే ముందుగాపార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. సోమవారం నుంచి సభలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై చర్చించారు. అనంతరం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సమావేశంలో బాబు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. మోదీ మాట్లాడిన తీరు తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. ‘మోదీ గారూ.. మీరు పరిపాలించే విధానం ఇదేనా? నమ్మకం అంటే ఇదేనా?’ అని అడిగారు. తన కంటే కేసీఆర్‌ పరిణతితో వ్యవహరించారని మోదీ అన్నారని, ప్రధాని మోదీ అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.

ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఎప్పుడు మాట్లాడారని నిలదీశారు. అవినీతిని సహించబోమంటూ గాలి అనుచరులకు టికెట్లు ఇచ్చారని, వైసీపీ ట్రాప్‌లో పడ్డారని మోదీ తనతో అన్నారని.. ఏపీకి న్యాయం చేయమంటే, ఇందులో మోదీ రాజకీయ కోణం చూశారని విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పిందని, స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని ఆర్థిక సంఘం మీకు ఎప్పుడు చెప్పింది? అంటూ చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించారు. మీరు వ్యవహరిస్తున్న తీరు నచ్చకే అవిశ్వాస తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు. 14వ ఆర్థికసంఘం పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని, రాష్ట్రాలతో సంబంధాలు కొనసాగించే పద్ధతి ఇదేనా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల తర్వాత తామే అవిశ్వాస తీర్మానం పెట్టామని.. మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలని చంద్రబాబు అన్నారు.

Related News