మాటకు మాట.. కేసీఆర్ వ్యాఖ్యలపై బాబు కౌంటర్

నల్గొండ బహిరంగసభలో సీఎం  కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణలో టీడీపీ ఉండటానికి కేసీఆర్‌ మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదని, తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బడుగు బలహీనవర్గాలకు వెన్నంటే వుందన్నారు. తెలుగు ప్రజలు అందరూ బాగుండాలని కోరుకోవడం తప్పా? హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం తన తప్పా? గురువారం తిరుపతిలో షియామీ సంస్థ ప్రతినిధులతో సమావేశమై ఎంఐ టీవీ, స్మార్ట్‌ఫోన్లను సీఎం ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు.

తనపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఒకింత భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. బహిరంగసభల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ విధంగా మాట్లాడడం సరికాదని, ఇష్టానుసారం మాట్లాడితే మంచిదికాదని హితవు పలికారు. తనమీదకి ఒంటికాలిపై వస్తున్నారు.. తనపై యుద్ధం చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ డైరెక్షన్‌లో కేసీఆర్ తనపై దాడి చేయడం సరికాదన్నారు. తానెప్పుడూ పరుష పదజాలంతో, వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని, సిద్ధాంతపరంగానే విభేదిస్తూ మాట్లాడుతుంటానని అన్నారు.

 

ఇంతకీ కేసీఆర్ ఏమన్నారు?

 

తెలంగాణ వ్యతిరేకి, నమ్మకద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని మహాకూటమి పేరుతో  కాంగ్రస్ ఎన్నికలకు వస్తోందని ఆరోపించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలుగు వాళ్లమంతా ఒకటేనంటూ ఇన్నాళ్లూ తెలంగాణకు తెగులు పట్టించిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ, ఆయనను తెలంగాణ ప్రజలపై రుద్దాలని చూస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ మూడోకన్ను తెరిస్తే చంద్రబాబుకు అథోగతేనని వ్యాఖ్యానించారు. నల్గొండలో గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌.. చంద్రబాబుతోపాటు కాంగ్రెస్‌ నేతలపైనా నిప్పులు చెరిగారు.

అది మహాకూటమి కాదని, తెలంగాణ ప్రజల పాలిట కాలకూట విషమన్నారు. మోదీ- కేసీఆర్‌లు ఒక్కటయ్యారని చంద్రబాబు చెబుతున్నారని, నాలుగేళ్ల పాటు మోదీ పక్కన ఉన్నది ఆయనే కదా? మోదీ కాళ్లు మొక్కి తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఆంధ్రలో కలిపేసుకోలేదా? మోదీని అడ్డుపెట్టుకొనే సీలేరు ప్రాజెక్టు, హైకోర్టు విభజన కాకుండా అడ్డుకోలేదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. మేం కొట్టిన దెబ్బకు విజయవాడలో పడ్డావని, అక్కడ పరిస్థితి బాగాలేదని బాబు, ఇక్కడ పెత్తనం చేద్దామని చూస్తున్నారని వ్యాఖ్యనించారు. చంద్రబాబుకు 15 స్థానాలు గెలిస్తే కాళేశ్వరం, డిండి, పాలమూరు ప్రాజెక్టు సహా అన్ని ఆగిపోతాయని, చంద్రబాబు బొడ్డులో కత్తిపట్టుకొని తిరుగుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.

Related News