ఎన్టీయార్ బయోపిక్.. ఇదీ చంద్రబాబు క్లారిటీ !

టాలీవుడ్‌లో బయోపిక్ సీజన్ పీక్‌స్టేజ్‌లో నడుస్తోంది. ఎన్టీయార్, వైఎస్సార్ జీవిత చరిత్రల్ని తెరకెక్కించే పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కొత్త తరాలకు పరిచయం చెయ్యడానికి మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘సైరా’ ప్రయత్నం మరోవైపు సాగుతోంది. కానీ.. రాజకీయ నేపథ్యమున్న ఎన్టీయార్, వైఎస్సార్ బయోపిక్స్ మీద మాత్రమే అంతకంతకూ ఆసక్తి పెరుగుతోంది. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు ఈ సినిమాల్ని ప్రచార వస్తువులుగా వాడుకోడానికి సిద్ధంగా ఉండడమే దీనికి కారణం.

 

మొదట్లో తేజ నేతృత్వంలో మొదలైన ఎన్టీయార్ ప్రాజెక్టు.. ఆ తరువాత తేడాలొచ్చి క్రిష్ చేతిలోకొచ్చి పడింది. అలా చేతులు మారిందో లేదో ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షెడ్యూల్లో కీలక సన్నివేశాలన్నీ పూర్తి చేస్తున్నారు డైరెక్టర్ క్రిష్. దీనికి సమాంతరంగా సినిమా ప్రమోషన్ కూడా దానంతటదే జరిగిపోతోంది. పూటకో పాత్ర, పాత్రధారి తమతమ గెటప్స్‌తో మీడియాకెక్కేస్తున్నారు. ఎన్టీయార్ భార్య బసవతారకం (విద్యాబాలన్), ఎస్వీ రంగారావు (మోహన్ బాబు), అక్కినేని నాగేశ్వరరావు (సుమంత్) మహానటి సావిత్రి (కీర్తి సురేష్), ఎల్వీ ప్రసాద్ (జిష్షు), నాదెండ్ల భాస్కర్ రావు (సచిన్).. ఇలా ఒక్కో రోల్‌కి సంబంధించిన డీటెయిల్స్ బైటికొస్తున్నాయి. తాజాగా.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (బీ. నాగిరెడ్డి), టెలివిజన్ మీడియా పర్సనాలిటీ సంజీవ్ రెడ్డి (పింగళి నాగేందర్ రావు), నరేష్ (బీఏ సుబ్బారావు) సెట్స్ మీద బిజీగా వున్నారు. క్రిష్ హ్యాండిల్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ పార్ట్ అనూహ్యంగా వేగం పుంజుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ ‘వేగం’ వెనుక రహస్యమేంటి?

 

దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి నెలకొన్న నేపథ్యంలో ఏపీలో సైతం ముందస్తు ఎన్నికల వాసన గుప్పుమంటోంది. జనవరిలోగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావొచ్చన్నది తెలుగుదేశం వర్గాల అంచనా. ఇప్పటికే ఎన్టీయార్ బయోపిక్‌ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తానని బాలయ్య చెప్పారు. కానీ.. మధ్యలో ఏర్పడ్డ ‘డిస్టర్బెన్స్’ కారణంగా ప్రొడక్షన్ ఆలస్యం కావచ్చన్న అనుమానంతో రిలీజ్ డేట్‌పై వెనకడుగు పడింది. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎన్టీయార్ బయోపిక్‌ జనవరిలో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవాలని సీఎం చంద్రబాబు బాలయ్యను డైరెక్ట్ చేశారన్నది అంతర్గతంగా వినిపించిన మాట! బావ మాటను తోసిపుచ్చలేక.. బాలయ్య క్రిష్‌ని తొందరపెడ్తున్నారని, ఈ వేగానికి కారణం అదేనని యూనిట్లో చెప్పుకుంటున్నారు.

 

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీని రికార్డ్ సమయంలో పూర్తి చేసి క్రెడిట్ కొట్టేసిన క్రిష్.. ఇప్పుడు ఎన్టీయార్ ప్రాజెక్ట్‌ని కూడా అదే అనుభవంతో పరుగులెత్తిస్తారని బాలయ్య నమ్ముతున్నారు. నాలుగైదు నెలల్లో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసి సంక్రాంతికల్లా సినిమాని తెర మీద పెడితే.. క్రిష్ మళ్ళీ గెలిచినట్లే ! సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరితో కలిసి బాలకృష్ణ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు.. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో ఎంత మేర లబ్ది చేకూర్చుతుందన్నది సస్పెన్స్. మమ్ముట్టి లీడ్ రోల్ చేస్తున్న వైఎస్సార్ బయోపిక్‌తో వైసీపీ లాభం పొందవచ్చన్న ఆందోళనతోనే చంద్రబాబు.. ఎన్టీయార్ బయోపిక్ మీద ఆశలు పెట్టుకున్నారా?

Related News