‘హాయ్‌లాండ్‌ను లోకేష్ బేరమాడారట’

అగ్రిగోల్డ్ అక్రమాలపై చంద్రబాబు సర్కారు మోసపూరితంగా కావాలనే తాత్సారం చేస్తోందని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ముఖ్యమంత్రి కుమారుడు హాయ్ లాండ్ ను అమ్మమంటే అమ్మలేదనే కారణంతో దీనిని ఈ స్థాయికి తెచ్చారన్నది తమదగ్గరున్న సమాచారమని చెప్పుకొచ్చారు. అగ్రిగోల్డ్ అంశంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ అక్రమాలపై ఏపీ రాష్ట్ర బీజేపీ వారంరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు. అగ్రిగోల్డ్ మోసం చేసిన 35 లక్షల మంది బాధితులకు అండగా నిలుస్తామన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ లైవ్ టీవీ షోలో బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావును పచ్చిబూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరులోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతల్ని హెచ్చరించారు. ప్రస్తుతం టీడీపీలో దొంగలు ఉన్నారని ఒకరు దుర్గగుడి దగ్గర కొబ్బరి చిప్పలు, మరొకరు చెప్పులు కొట్టేసిన వాళ్లయితే, కాల్ మనీ, సెక్స్ రాకెట్ నిందితులు మరికొందరని ఆయన విమర్శించారు. వారం వారం సంధించే ప్రశ్నలలో భాగంగా ఆయన ఐదు ప్రశ్నల్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంధించారు. అంచనాలు పెంచి సీఎం రమేశ్‌కు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా?, ఐటీ దాడులు జరిగితే రాష్ట్రంలో భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిలను కూర్చోబెట్టి వాటాలు పంచుకోమని చెప్పలేదా? రూ. 480 కోట్లతో నిరుద్యోగులకు ఇచ్చే శిక్షణ కాంట్రాక్టును ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో అంతర్యం ఏమిటి? పల్నాడులో అక్రమ మైనింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించుకోగలరా ? అన్న ప్రశ్నల్ని సంధించారు కన్నా.

Related News