కూటమిలో తేలని లెక్కలు, 50 సీట్లకుపైనే డిమాండ్

తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంకా కూటమి లెక్కలు తేలలేదు. ఇప్పటికే పలుమార్లు భేటీ అయినా ఫలితం లేకపోయింది. రెండు, మూడురోజుల్లో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. కూటమి పక్షాలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితిల నేతలు.. శుక్రవారం హైదరాబాద్‌లో భేటీకానున్నారు. ఉమ్మడి ప్రణాళిక ముసాయిదా రెడీ కావడంతో సీట్ల సర్దుబాటుపై ఫోకస్ చేశాయి.

మొత్తం తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు వుండగా, కాంగ్రెస్ 90 చోట్ల పోటీ చేయాలని ఆలోచన చేస్తోంది. కూటమిలోని మిగిలిన పార్టీలన్నీ 50 స్థానాలపైనే కోరుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన సీట్లతోపాటు సెకండ్ ప్లేస్‌ వచ్చిన నియోజకవర్గాలను ఇవ్వాలన్నది టీడీపీ మాట. 2014లో ఏడు సీట్లకు పోటీ చేసి ఒక్క స్థానాన్ని గెలుచుకున్న సీపీఐ, ఇప్పుడు కనీసం ఐదు సీట్లైనా ఇవ్వాలని అంటోంది. ఇక తెలంగాణ జన సమితి విషయానికొస్తే.. కనీసం 17 స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతోంది. తాము గెలిచే సీట్లను భాగస్వామ్య పక్షాలకు ఇచ్చేదిలేదని కాంగ్రెస్ చెబుతోంది. ఎన్ని సీట్లు అనేదాని కన్నా, ఏయే సీట్లు కోరుతున్నారనే దానిపైనే శుక్రవారం చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. గెలుపే ప్రాతిపదికగా కూటమిలోని అన్నిపార్టీలకు సముచిత స్థానం వుంటుందని చెబుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

Related News