‘ఆపరేషన్ గరుడ’ హీరో నుంచి మరో రెండు డైనమైట్లు!

‘ఆపరేషన్ గరుడ’ హీరో శివాజీ మళ్ళీ లైన్లోకొచ్చేశాడు. ‘నేను చెప్పినట్లే సీఎం చంద్రబాబుకి నోటీసులొచ్చాయి చూశారా” అంటూ తన ‘జోస్యాన్ని’ ఆవేశంగా సమర్థించుకున్నారు. ‘నోటీసుల విషయం చంద్రబాబుకు తెలీకముందే మీకెలా తెలిసింది’ అన్న ప్రశ్నకు నాకుండే ఇంటిలిజెన్స్ నాకుంది అంటూ అసహనం వెలిబుచ్చారు శివాజీ. ఎనిమిదేళ్లనాటి కేసులో ఇప్పుడు నోటీసులిస్తారా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. ”మీ కుట్రలు మీరు చేసుకోండి.. కాకపొతే దీంతో భావితరాలు నష్టపోతాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈ ట్రాప్‌లో పడితే మరో రెండు మూడు కేసుల్లో నోటీసులొస్తాయని, ఆ నోటీసులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పిన శివాజీ.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాల్ని కూల్చివేయడం ప్రజాస్వామ్యబద్దం కాదన్నారు. ఇటు ఏపీ పాలిటిక్స్‌ని కూడా టచ్ చేశారు. ”కేసులతో చంద్రబాబు జైలుకెళితే జనవరిలో అసెంబ్లీ రద్దయి ఎన్నికలొస్తాయా..? ఈ ఆలోచనతోనే ‘జనవరిలో ఎన్నికలం’టూ జగన్ పార్టీని అప్రమత్తం చేశాడా?’ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు శివాజీ. ఏదేమైనా.. ఏపీ పాలిటిక్స్‌లో శివాజీ ఒక ‘ఇంట్రస్టింగ్ క్యారెక్టర్’గా మారిపోయారన్నది వాస్తవం.

Related News