‘అటల్‌జీ’ మీద కొత్త రగడ!

ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్‌కీ, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కీ మధ్య ఒక ‘యుద్ధమే’ జరుగుతోంది. నాలుగునెలలుగా సమ్మెలో వున్న ఐఏఎస్‌లు పనుల్లోకి దిగేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం కేజ్రీవాల్ నెత్తీనోరూ బాదుకుంటున్నా.. ఆ గవర్నర్ సాబ్ నిమ్మకునీరెత్తినట్లు వుండిపొయ్యారు. చివరకు చేసేది లేక.. ఆయన ఉంటున్న రాజ్ నివాస్‌లోనే రేయీపగలూ ఉండిపోయి.. ఒక సామాన్యుడి తరహాలో నిరసన తెలుపుతున్నారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ‘బీజేపీ స్పాన్సర్డ్’ మనిషి కనుక సహజంగానే మొండిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆప్ సర్కారులో కొద్దికొద్దిగా సహనం నశిస్తోంది. ఈ క్రమంలోనే.. ఢిల్లీలో ఒక నిర్వాకం చోటుచేసుకుంది. ఒకే ఒక్క ‘ప్లకార్డ్’ ఢిల్లీలో లొల్లిలొల్లి చేస్తోంది. ఇంతకీ ఏమిటా లొల్లి?

సీఎం ఆఫీసు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ హౌస్ దాకా ఈ బుధవారం నిరసన కవాతు నిర్వహించింది ఆమ్ ఆద్మీ పార్టీ. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్న ఈ మార్చ్‌లో.. ఒక ప్లకార్డ్.. దాని మీద రాసున్న నాలుగక్షరాలు.. మీడియా దృష్టిలో పడ్డాయి. ఆప్ ఎమ్మెల్యే లాంబా, ఆమె పక్కనున్న మరో కార్యకర్త పట్టుకున్న ఈ ప్లకార్డ్ మీద ‘దిల్లీ మాంగే అటల్ సే పహ్లే అనిల్ కీ చుట్టీ’ అని రాసుంది. అటల్ కంటే అనిల్ (లెఫ్టినెంట్ గవర్నర్) బెడద నుంచి ఢిల్లీ బైటపడాలనుకుంటోంది.. అనేది ఆ మాటల అర్థం. ఇందులోని అంతరార్థమే ఇప్పుడు రాద్ధాంతమై కూర్చుంది. ఆమ్ ఆద్మీ పార్టీని కార్నర్ చేసేసింది.

ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని, బీజేపీ ఐకానిక్ లీడర్ అటల్ బిహారీ వాజ్‌పేయి.. క్రమంగా కోలుకుంటున్నారు. ‘గెట్ వెల్ సూన్’ అంటూ ఆయనకు శ్రేయోభిలాషుల నుంచి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. దేశం మెచ్చిన నాయకుడిగా అందరూ ఆరాధిస్తున్న అటల్‌జీ మీదనా మీ సెటైర్లు.. అంటూ బీజేపీ శ్రేణులు ఆమ్‌ఆద్మీ పార్టీ మీద నిప్పులు చెరుగుతున్నాయి. కానీ.. 20 వేల మంది జనం.. అందులో వందలాది ప్లకార్డులు.. ఒకే ఒక్క చోట దొర్లిన ఆ నాలుగు పదాలను పట్టుకుని మమ్మల్ని తప్పుపట్టడం భావ్యం కాదంటూ ఆప్ అధిష్టానం సర్దుకుంటోంది. అటల్ మీద తమకు ఎటువంటి తప్పుడు అభిప్రాయమూ లేదని, కేవలం తాము చేసే నిరసనను తప్పుదోవ పట్టించడానికే.. బీజేపీ ‘ప్రచారం’ చేస్తోందని ఆరోపిస్తోంది. ఒక్క ప్లకార్డ్ ఎంత పని చేసింది..?

Related News