58 మంది మృతి, బస్సు నడిపింది ‘ఉత్తమ డ్రైవర్’

కొండగట్టు ఘటన బస్సు ప్రమాదాల చరిత్రలోనే అత్యంత విషాదం. దేశంలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం.ఈ ఘటనలో చనిపోయింది 58 మంది.  ఇందులో పురుషులు 15 మంది, మహిళలు 38 మంది, చిన్నారులు ఐదుగురు వున్నారు. గాయపడినవాళ్లు సంఖ్య 43కి చేరింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 101 మంది వరకు ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఒక్కొక్కరూ ప్రాణాలొదిలేశారు. నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతమంతా శ్మశానంగా మారింది.

జగిత్యాలలోని కొండగట్టు ఆలయ సమీపంలోని జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. జనాలతో బస్సు అంతా కిక్కిరిసింది. బస్సు ఆఖరి మలుపు వద్దకు చేరుకునే సమయానికి అటు నుంచి గుట్టపైకి వెళ్తున్న ఓ మినీ వ్యాన్‌ ఎదురైంది. దానిని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పింది. భారీ కుదుపులను గమనించిన ప్రయాణికులు, ఒక్కసారిగా కేకలు వేయడంతో డ్రైవర్ కంగారుపడ్డాడు. బస్సుకు బ్రేకులు పడకపోవడంతో పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు డ్రైవర్. ఎదురుగావున్న రెయిలింగ్‌ను ఢీకొన్న బస్సు.. 20 అడుగుల లోతులోకి దూసుకుపోయింది. మృతుల్లో ఎక్కువమంది శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్‌, తిర్మలాపూర్‌లకు చెందినవారే ఉన్నారు.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్ శ్రీనివాస్ కూడా మృతి చెందారు. ఆగస్టు 15న శ్రీనివాస్ ‘ఉత్తమ డ్రైవర్’ అవార్డును అందుకున్నాడు. కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆర్టీసీ తరఫున రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని, మృతుల్లో రైతులుంటే రైతు బీమానూ వర్తింపజేస్తామని అన్నారు.

 

 

READ ALSO

Related News