జమిలి ‘జంజాటం’..మోదీ ప్లాన్ ఫ్లాప్ ?

దేశంలో జమిలి ఎన్నికలపై ప్రధాని మోదీ ప్లాన్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తోంది. అన్ని  రాష్ట్రాలకు. లోక్ సభకు  ఒకేసారి  ఎన్నికల నిర్వహణపై జాతీయ లా కమిషన్ ఎదుట హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించిన పార్టీల్లో నాలుగు పార్టీలు మాత్రమే ఇందుకు ఓకె చెప్పగా..9 పార్టీలు తమ వ్యతిరేకత తెలిపాయి. ఢిల్లీలో లా కమిషన్ రెండు రోజులుగా జమిలిపై అభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఏకకాల  ఎన్నికలకు తాము అనుకూలమని టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్, ఏఐఏడీఎంకె, సమాజ్ వాదీ పార్టీలు స్పష్టం చేశాయి. అయితే..టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకె, సీపీఐ, సీపీఎం, జనతాదళ్-ఎస్, ఫార్వర్డ్ బ్లాక్, గోవా ఫార్వర్డ్ పార్టీలు ఇందుకు నో చెప్పడం విశేషం. కానీ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మాత్రం మౌనం వహించాయి.

ఈ యోచనపై తమ అభిప్రాయం తెలిపేందుకు తమకు మరింత సమయం కావాలని బీజేపీ కోరింది. ఈ నెల 31 నాటికి తమ వైఖరి వెల్లడిస్తామని పేర్కొంది. (ఆగస్టు చివరినాటికి లా కమిషన్ కాల పరిమితి ముగుస్తుంది). ఇక మా అభిప్రాయం చెప్పే ముందు ఇతర పార్టీలతో సంప్రదించాల్సిఉందని, అందువల్ల తమకు కూడా కొంత గడువు కావాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది. జమిలి ఎన్నికలు బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమని, ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీసేందుకే మోదీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని టీడీపీ వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇది రాజ్యాంగవిరుద్ధమని కూడా అభిప్రాయపడ్డాయి. అయితే ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల ప్రజా ధనాన్ని ఆదా చేయవచ్చునని, ఇది మంచి ఆలోచనే అని తెరాస వంటి పార్టీలు మద్దతునిస్తున్నాయి. ఏమైనా… మెజారిటీ పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తుండడం..మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టినట్టే.

Related News