దేవరగట్టు సమరం.. 35 మందికి గాయాలు

విజయదశమి సందర్భంగా కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో 35 మంది గాయపడ్డారు. వాళ్లలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రతీ ఏడాది విజయదశమి రోజు కర్రల సమరం జరగడం ఆనవాయితీ గా వస్తోంది. దేవరగట్టు సమీపంలోవున్న కొండపై వెలసిన మాళమ్మ మల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. వీటిని దక్కించుకోవడం కోసం నాలుగైదు గ్రామాల ప్రజలు రెండువర్గాలుగా ఏర్పడి కర్రలతో పోరుకి తలపడ్డారు.

ఈ వేడుకలో ఇరువర్గాలవాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. బన్ని ఉత్సవంలో హింస జరగకుండా ఉండేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఏ మాత్రం ఫలించలేదు. వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. నెలరోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. అయితే కర్రల సమరంలో ప్రాణనష్టం లేకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఏపీ, కర్ణాటకకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

Related News