డ్రైవర్ తప్పిదం.. 17మంది మృత్యువాత

బస్ అంత స్పీడ్ నడపొద్దని మొత్తుకున్నా ప్రయాణీకుల మాట వినలేదు. మితిమీరిన వేగంతో బస్సునడిపి 17మంది ప్రాణాల్ని క్షణాల్లో తీసేశాడు. 35 మందిని తీవ్ర గాయాల పాలు చేశాడు. బుధవారం తెల్లవారుజామున బస్ డ్రైవర్ చేసిన ఘోర తప్పిదమిది.

రాజస్థాన్‌లోని జయపూర్ నుంచి యూపీలోని ఫరూక్కాబాధ్‌ వస్తోన్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు కిర్తాపూర్ గ్రామం వద్ద బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో బోల్తా పడింది. బస్ లో ఉన్న 16 మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. క్షతగాత్రులను వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

బస్సును డ్రైవర్ వేగంగా నడపడం వల్ల అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని బాధితులు పేర్కొన్నారు. గాయపడిన వారిలో డ్రైవర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కొంతమంది ప్రయాణీకులు బస్సు టాప్ మీద ఉన్నట్టు సమాచారం. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Related News