జమిలి ఎన్నికలకు సిద్ధం..

జమిలి ఎన్నికలకు తాము సిద్ధమని ప్రకటించారు టీఆర్ఎస్ ఎంపీలు. ఆదివారం ఢిల్లీలో లా కమిషన్ ఎదుట హాజరైన వీరు.. ఒకేసారి ఎన్నికలకు తాము రెడీ అని, జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చునని స్పష్టం చేశారు. ఈ తరహా ఎన్నికల సాధ్యా సాధ్యాలపై జాతీయ లా కమిషన్ వివిధ పార్టీల అభిప్రాయాలను సేకరిస్తున్న నేపథ్యంలో వీరు తమ వైఖరిని వెల్లడించారు.

ఈ మేరకు టీఆర్ఎస్ ప్రతినిధిగా ఎంపీ వినోద్ కుమార్ కమిషన్ ఎదుట హాజరై తమ పార్టీ అభిప్రాయాన్ని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. జమిలి ఎన్నికలంటే ముందస్తు ఎన్నికలు కావని, అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎలెక్షన్స్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇది ప్రధాని మోదీ తెచ్చిన కొత్త విధానం కాదని, దీనిపై చర్చ కూడా ఇప్పటికిప్పుడు మొదలైంది కాదని ఆయన అన్నారు.’ ఈ విధమైన ఎన్నికల మీద జాతీయ లా కమిషన్ 1986 నుంచే చర్చిస్తోంది. జమిలి ఎన్నికల పద్ధతి వల్ల ఐదేళ్ళ పాటు కేంద్ర, రాష్ట్ర పాలన సుగమంగా సాగే వీలుంది ‘ అని వినోద్ వ్యాఖ్యానించారు.

2019 నుంచి జమిలి ఎన్నికల నిర్వహణకు తెరాస అనుకూలంగా ఉంది అన్నారాయన.. అటు-సమాజ్ వాదీ పార్టీకూడా మేమూ సిద్ధమేనని ప్రకటించింది. పార్టీ తరఫున ఆ పార్టీ నేత రాం గోపాల్ యాదవ్ ఈ మేరకు తమ అభిప్రాయం తెలిపారు. 2019 నుంచి అయితే ఎన్నికలకు తాము సిద్ధమని, లోక్ సభతో బాటు అన్ని రాష్ట్రాలకూ ఒకేసారి ఎలెక్షన్స్ నిర్వహించాలని ఆయన కోరారు. 2019 తరువాత అంటే మాత్రం అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.

Related News