30న విశాఖలో ‘వంచన దినం’

ఏపీ ప్రజల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ అమలు విషయంలో చంద్రబాబు మోసపూరిత విధానాలు అవలంభింస్తున్నారని విమర్శిస్తోంది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపైనా వైసీపీ తన నిరసన తెలియచేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో ‘వంచన దినం’ పాటించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి వద్ద పాదయాత్ర శిబిరంలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

30వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకూ 12 గంటల పాటు రాజీనామాలు చేసిన పార్టీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు నిరాహారదీక్ష చేసి నిరసన తెలుపుతారని ప్రకటించారు. ఆరోజున జగన్‌ తన పాదయాత్రను యథావిధిగా కొనసాగిస్తారని, అయితే నల్లజెండాలు, నల్ల రిబ్బన్లు ధరించి యాత్ర సాగుతుందన్నారు. పార్టీ సీనియర్‌ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, కె.పార్థసారథి, భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వంచనదినం వివరాలు వెల్లడించారు.

Related News