నా భర్తను మార్చేశారు దేవుడా !

తెలంగాణా ప్రభుత్వ ప్రకటనలు తన కొంప ముంచాయని వాపోతోంది పద్మ అనే మహిళ ! ఇంగ్లీషు, తెలుగు పేపర్లలో వచ్చిన రెండు వేర్వేరు ప్రకటనల్లో ‘మొగుళ్ళ’ చిత్రాలు చూసి నిర్ఘాంతపోయిందట ఈమె. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయికి చెందిన ఈమె మనోవ్యధ విచిత్రంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణా సర్కార్ ఈ మధ్య ‘కంటివెలుగు’, ఆ మధ్య ‘ రైతుబంధు’ పథకాలు ప్రారంభించింది. ఈ పథకాల యాడ్‌లు ఇంగ్లీషు, తెలుగు వార్తాపత్రికల్లో వచ్చాయి. అయితే ఎక్కడో పొరబాటు జరిగింది. ఇంగ్లీషు పత్రికల్లో ‘ రైతుబంధు’ పథకం తాలూకు యాడ్‌లో తన ఫోటో పక్కన ఒకరిని (భర్తగా), తెలుగు డైలీల్లో ‘కంటి వెలుగు’ ప్రకటన తాలూకు యాడ్‌లో మరొకరిని చూపడం ఆశ్చర్యంగా ఉందని. ఈమె అంటోంది.

‘కంటి వెలుగు’ ప్రారంభ సమయంలో నా భర్త ఫోటో బదులు మరొకరి ఫోటో పెట్టారు. ఇది చూసి చాలామంది నన్ను హేళన చేశారు అని కన్నీరు పెట్టినంత పని చేసింది. మేం ఒకప్పుడు కాపు సారా కాచుకుని తాగేవాళ్ళమని , కానీ ఇప్పుడు సారా కాయడంలేదని ఆనందంగా ఉన్నామని చెబుతూ పేపర్లో ప్రకటన ఇచ్చారని, ఆ తర్వాత ‘ రైతుబంధు’ పథకం ప్రారంభించిన సమయంలో.. తమకు పొలం ఉందని, రూ. 4 వేలు ప్రభుత్వం నుంచి అందుకుని సంతోషంగా ఉన్నామని మరో ప్రకటన వేశారని పద్మ తెలిపింది.

నిజానికి మాకు పొలం లేదు. కానీ చెక్కులు ఇచ్చినట్టు పేర్కొన్నారు.. అని వివరించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకువెళ్ళామని వెల్లడించింది. ప్రస్తుతం యాదగిరిగుట్ట సమీపంలోని కొంగవల్లిలో ఉంటున్నామని, మూడేళ్ళ క్రితం కొందరు వచ్చి తమ ఫోటోలు తీసుకువెళ్ళారని ఆమె గుర్తు చేసుకుంది.

Related News