ఏపీలో లిక్కర్ బాబులకు షాక్

ఏపీలో మందుబాబులకు ఊహించని షాక్. మూడురోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా మద్యం సరఫరా నిలిచిపోయింది. షాపుల్లో వున్న సరుకు మరో నాలుగు రోజులకు మాత్రమే సరిపోతుందని, ఈలోగా సరకు రాకుంటే కష్టమేనని అంటున్నారు వైన్‌షాపు నిర్వాహకులు. ఇంతకీ.. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ డిపోల నుంచి వైన్‌ షాపులకు మద్యం ఎందుకు సరఫరా కాలేదు? అసలు స్టోరీలోకి వెళ్తే… గతంలో ఆఫ్‌లైన్ విధానంలో మద్యం అమ్మకాలు జరిగేవి. దీని ద్వారా కల్తీ మద్యం సరఫరా పెరగడం గమనించిన ఏపీ సర్కార్ ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది.

కంపెనీ నుంచి వచ్చిన సరుకును బేవరేజెస్ డిపోల ద్వారా మద్యం షాపులకు అందజేసే పద్దతి. దీని బాధ్యతను నాలుగేళ్ల కిందటి నుంచే యూఎస్‌సీ సంస్థ నిర్వహిస్తోంది. ఆ సంస్థ ఆన్‌లైన్ నిర్వహణతోపాటు హోలోగ్రామ్ కూడా వేస్తుంది. దీని ద్వారా మద్యం.. ఏయే డిపోల మీదుగా షాపులకు వచ్చిందనే విషయాన్ని సునాయాసంగా తెలుసుకోవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే నకిలీ మద్యం అరికట్టవచ్చు. ఈ సేవలకు గాను 17 నెలలకుగాను రూ.59 కోట్ల బకాయిలను ఆ సంస్థకు ప్రభుత్వమే చెల్లించాల్సివుంది. కొద్దిరోజులుగా తమ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆ సంస్థ ప్రతినిధులు కోరినా ఎలాంటి స్పందన లేదు. చివరకు మూడురోజుల కిందట ఈ సంస్థ తన సేవలను నిలిపివేసింది. ఇప్పుడు రాష్ర్టవ్యాప్తంగా 4380 వైన్ షాపులు, 800 పైగా బార్లు వున్నాయి. ఇప్పటికి స్టాక్ వున్న సరుకును మాత్రమే విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వంతో ఆ సంస్థ చర్చలు జరుపుతోంది. ఈలోగా కొలిక్కి వస్తే ఓకే. లేకుంటే ఏపీలో మందుబాబులకు ఇబ్బందులు తప్పవన్నమాట.

READ ALSO

Related News