బస్సులో నాని హంగామా, కేటీఆర్ ఫైర్

తెలంగాణా ఆర్టీసీ బస్సుల్లో పైరేటెడ్ సినిమాలు ప్రదర్శించడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘ కృష్ణార్జునయుద్ధం ‘ విడుదలైన మరుసటిరోజే టీఎస్సార్టీసీ గరుడ వోల్వో బస్సులో ప్రదర్శించారు. ఈ విషయాన్ని సునీల్ కొప్పరపు అనే వ్యక్తి కేటీఆర్ దృష్టికి తీసుకువస్తూ.. ఆయనకు ట్వీట్ చేశారు.

హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఈ బస్సులో ఈ మూవీ పైరసీ వేశారని అంటూ స్క్రీన్ షాట్ తో సహా ఆయనకు పంపారు. ప్రభుత్వ సంస్థల్లోనే ఇలా కొత్త సినిమాల పైరసీ జరుగుతుంటే ఈ బెడదను నియంత్రించాలని సామాన్యుడిని ఎలా అడుగుతారని సునీల్ ప్రశ్నించారు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్.. ఆర్టీసీ సిబ్బంది తీరుపై మండిపడుతూ.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సంస్థ ఎండీని కోరారు. తన ట్వీట్ కు వెంటనే స్పందించిన కేటీఆర్ కు సునీల్ కొప్పరపు ధన్యవాదాలు తెలిపాడు.

 

Related News