టాలీవుడ్‌లో ‘షీ టీమ్స్’.. ‘ఆమె’ నేతృత్వంలో 21 మంది!

తెలుగు సినీ పరిశ్రమ మొత్తం.. తెలంగాణ సర్కార్ దగ్గర సాగిలపడింది. ‘కాస్టింగ్ కౌచ్’ సంక్షోభం నేపథ్యంలో ఇండస్ట్రీలో నెలకొన్న అలజడి నుంచి ఎలా బైటపడాలో చెప్పమంటూ సర్కార్ పంచన చేరింది. పరిశ్రమలోని పెద్దలు, ఆర్టిస్టుల సంఘం ప్రతినిధులతో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమావేశమయ్యారు. శ్రీరెడ్డి తిరుగుబాటు.. తదనంతర పరిణామాలన్నిటి మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ‘శ్రీరెడ్డి’ అర్థనగ్న ప్రదర్శనతో జాతీయ మానవహక్కుల కమిషన్‌ స్పందించి తెలంగాణ సర్కారుకు నోటీసులు జారీ చేసిన క్రమంలో.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇన్‌పుట్స్ తీసుకున్నారు మంత్రి తలసాని. సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే ‘షి’ టీమ్స్ కి ఫిర్యాదు చేయాలని.. బాధిత మహిళలకు వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇటు.. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్, మిగతా సమస్యలపై సినీ ప్రముఖులతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. 21మంది సభ్యులుండే ఈ కమిటీకి యార్లగడ్డ సుప్రియ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వున్న సుప్రియ.. ఫీల్డ్‌లోని అన్ని కుటుంబాలు, వర్గాలతో సన్నిహితంగా వుంటారు. 24 క్రాఫ్ట్స్ అధ్యక్ష, కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులు. ఫిలిం ఛాంబర్ ప్రతిపాదించిన CASH కమిటీ ఏర్పాటు మీద కూడా మంతనాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఫిలిం ఛాంబర్ కాంపౌండ్‌లో మీడియా వాహనాలపై జరిగిన దాడిని జీవిత, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సినీ పెద్దలు ఖండించారు. ఇటువంటి చర్యల్ని సినిమా కుటుంబం ఎప్పుడూ స్వాగతించబోదన్నారు. ఏపీలో జరుగుతున్న స్పెషల్ స్టేటస్ పోరాటానికి పరిశ్రమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కూడా హామీ ఇచ్చారు.

READ ALSO

Related News