‘తప్పొప్పుకున్న’ రాయపాటి!

తెలుగుదేశం-బీజేపీల మధ్య బంధం తెగిపోయిన నేపథ్యంలో ఏపీలో రోజుకో ‘బ్రేకింగ్’ న్యూస్ వినాల్సి వస్తోంది. ఒక పార్టీ మీద మరొక పార్టీ ఆరోపణల దండయాత్ర షురూ చేసుకుంటున్నాయి. బీజేపీ నేతలయితే చంద్రబాబు పాలన అవినీతిమయమైందంటూ అభియోగాలు మోపుతూనే వున్నారు. అధికారం మీ చేతిలో వుంది.. దమ్ముంటే విచారణ చేయించొచ్చు కదా.. అంటూ మిగతా పార్టీలు రెచ్చగొడుతున్న క్రమంలో కేంద్రం ప్రత్యక్ష చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పడ్డ మొదటి వికెట్టే ‘రాయపాటి’ అంటూ సందేహాలొస్తున్నాయి.

తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కార్పొరేట్ ఆఫీసులపై సెంట్రల్ జీఎస్టీ అదికారులు దాడి చేశారన్న వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక తాజా కలకలం. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ 2012లో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును దక్కించుకుంది. రాయపాటి కంపెనీకి లబ్ది చేకూర్చడం కోసమే పోలవరం వ్యయాన్ని పెంచేశారంటూ చంద్రబాబుపై ఆరోపణలొచ్చాయి. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ‘రాయపాటి’పై దాడి జరిగిందంటూ రాజకీయ ప్రేలాపనలు వినిపించాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. తమ కంపెనీ జీఎస్టీ చెల్లింపుల్లో ‘మతలబు’ ఉందంటూ సాక్షాత్తూ ఎంపీయే సూచనప్రాయంగా అంగీకరించారు. జీఎస్టీ అధికారుల ‘రైడ్’ వార్తలు నిజమేనని ధృవీకరించిన రాయపాటి.. తమ ఉద్యోగులకు జీఎస్టీ విషయమై సరైన అవగాహన ఉండకపోవచ్చంటూ ఒక ఆసక్తికరమైన వివరణ ఇచ్చుకున్నారు.

Related News