మాజీ స్పీకర్ సోమనాథ్ ఇక లేరు

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. కొద్దిరోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు ఆయన. ఈనెల 7న ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి మెరుగవడంతో డిశ్ఛార్జ్ అయ్యారు. ఐతే, ఆదివారం స్వల్పంగా గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ని ఆసుప్రతికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేశారు వైద్యులు. ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఇవాళ ఉదయం కన్నుమూశారు.

పదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు సోమ్‌నాథ్‌ ఛటర్జీ. సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. 1971 నుంచి 2009 వరకు సీపీఎం తరపున 10 సార్లు ఎంపీగా పనిచేశారు. ఛటర్జీ పొలిటికల్ లైఫ్‌లో ఒకసారి మాత్రమే ఓటమి పాలయ్యారు. 1984లో జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి మమతాబెనర్జీ చేతిలో సోమనాథ్ ఓడిపోయారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1968లో సీపీఎం కార్యకర్తగా ప్రజాజీవితంలో అడుగుపెట్టిన ఛటర్జీ, తక్కువ సమయంలో కేంద్రకమిటీ సభ్యుడిగా ఎదిగారు. పదిసార్లు లోక్‌సభ ఎంపీగా సేవలందించారు. యూపీఏ-1 కూటమి నుంచి సీపీఎం వైదొలిగినా ఆయన మాత్రం స్పీకర్‌ పదవికి రాజీనామా చేయలేదు. దీంతో 2008లో ఛటర్జీని పార్టీ నుంచి సీపీఎం బహిష్కరించింది. మరోవైపు సోమనాథ్ మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలిపారు.

 

READ ALSO

Related News