సీబీఐ కోర్టులో లొంగిపోయిన శశికళ భర్త నటరాజన్

శశికళ ఫ్యామిలీకి కష్టాలు తప్పడంలేదు. ఇప్పటికే జైలులో శశికళ శిక్ష అనుభవిస్తుండగా, ఇప్పుడు ఆమె భర్త నటరాజన్ వంతైంది. గురువారం చెన్నైలోని సీబీఐ కోర్టులో ఆయన లొంగిపోయారు. బ్రిటన్ నుంచి విలాసవంతమైన కారు దిగుమతికి సంబంధించి సుంకం ఎగవేశారన్న కేసును ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణలకు ఆయన హాజరుకాలేదు. ఆరోగ్యపరమైన కారణాలను చూపించి తప్పించుకు తిరిగారు.

ఇదే కేసులో 8 ఏళ్ల కిందట చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నటరాజన్, మరో ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని నటరాజన్ అప్పీల్ చేశాడు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుని గత నవంబర్‌లో మద్రాస్ హైకోర్టు సమర్థించింది. దీంతో గురువారం నటరాజన్ న్యాయస్థానం ముందు లొంగిపోయారు. 1994లో లెక్సస్ కారుని దిగుమతి చేసుకున్న నటరాజన్, కారు పత్రాలను తారుమారు చేసి పన్ను ఎగ్గొట్టిన విషయం తెల్సిందే!

Related News