హైదరాబాద్ వెలవెల.. బస్సులు, రైళ్లు కిటకిట

తెల్లవారుజామునుంచే ట్రాఫిక్ తో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతికి నగరంలోని జనం సొంత ఊళ్లకు తరలి వెళ్తుండటంతో సిటీ బోసిపోయి కనిపిస్తోంది. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసికనిపిస్తున్నాయి. రెగ్యులర్‌ రైళ్లు, బస్సులు, ప్రత్యేక రైళ్లు, బస్సులు రెట్టింపు ప్రయాణికులతో బయలుదేరుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సుమారు 3,500 రెగ్యులర్‌ బస్సులతో పాటు, మరో 3,650 ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికీ సరిపోవడంలేదు.

ఇక సొంత వాహనాలు, ట్రావెల్స్‌ కార్లు, ఇతర రకాల వాహనాల్లో సైతం భారీ సంఖ్యలో ఊళ్లకు బయలుదేరి వెళ్తుండటంతో టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులుతీరుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో నగర ప్రజలు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. ఈ నాలుగు రోజుల్లో వివిధ మార్గాల్లో సుమారు 15 లక్షల మందికి పైగా ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో మరో 5 లక్షల మందికి పైగా ఊళ్లకు తరలి వెళ్లనున్నారు.

Related News