టీఆర్ఎస్-కాంగ్రెస్ ‘సై’ ఆట.. రేపు 2గంటలకు

తెలంగాణలో విద్యుత్‌ సరఫరా విషయంలో ఘనత మాదంటే మాదంటున్నాయి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు. 24గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తే కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోంది టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాదు, కరెంట్‌పై కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డి చెబుతున్న లెక్కలన్నీ తప్పులని నిరూపిస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, మేం చెప్పే లెక్కలు అబద్ధమైతే ప్రజలు వేసే ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ కాంగ్రెస్‌ నేత సుబ్బరామిరెడ్డిదని, అవకతవకలు ఉన్నాయని ఆయనతో చెప్పించండని ప్రతి సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎంపీ బాల్కాసుమన్. విద్యుత్‌ రంగంపై కాంగ్రెస్‌తో సవాల్‌కు తాను సిద్ధమని, సమయం, స్థలం రేవంత్‌ నిర్ణయించినా అభ్యంతరం లేదని సుమన్ అంటున్నారు. మా వైపు నుంచి నాతో పాటు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌ చర్చకు వస్తారు.. చెప్పేది అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానని ఎంపీ సుమన్ శపథం చేశారు.

ఇక, రేవంత్ మాత్రం కాంగ్రెస్‌ పుణ్యమే ఇప్పుడు అందుతున్న 24 గంటల కరెంట్‌ అంటున్నారు. టీఆర్‌ఎస్‌ బహిరంగ సవాల్‌ను స్వీకరిస్తున్నానన్నారు. 12వ తేదీ మ.2గంటలకు చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రగతి భవన్‌లో అయినా సరే, మీరు నిర్ణయించిన ఎక్కడైనా సరే.. ఎమ్మెల్యే సంపత్‌, శ్రవణ్‌తో చర్చకు వస్తానని రేవంత్‌రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. బీహెచ్‌ఈఎల్‌ ద్వారా తమకు కావాల్సినవారికి విద్యుత్‌ ప్రాజెక్టుల పనులు ఇచ్చారని రేవంత్ ఆరోపణలకు దిగారు. విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం రూ.లక్ష కోట్లు అప్పు చేయబోతున్నారని విమర్శించారు. ఐఏఎస్‌లను పక్కనపెట్టి ఎందుకు రిటైరైన అధికారులను ఉన్నత పదవుల్లో నియమించారని ఆయన ప్రశ్నించారు.

Related News