బ్యాంక్ స్కామ్స్….పార్లమెంటరీ కమిటీ సీరియస్

వరుసగా జరుగుతున్న బ్యాంకు కుంభకోణాల మీద పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఫైనాన్స్) సీరియస్ అయింది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నుంచి వివరాలు రాబట్టాలని నిర్ణయించిన ఈ కమిటీ..వచ్చే మే నెల 17 న తమ ఎదుట హాజరు కావాలని ఆయనను కోరింది. కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో కుంభ కోణాలు,  ఇతర రెగ్యులేషన్స్ గురించి ఉర్జిత్ పటేల్ ఏం చెబుతారో ఈ పానెల్ తెలుసుకోగోరుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇటీవల దేశంలో జరిగిన బ్యాంకింగ్ స్కామ్ లు ప్రభుత్వాన్ని, ఆర్ధిక రంగ నిపుణులను షాక్ కి గురి చేశాయి. పీ ఎన్ బీ స్కామ్ లో వజ్రాల వర్తకుడు నీరవ్ మోదీ, ఆయన బంధువు మెహుల్ చోక్సీ వంటి వారి నిర్వాకం, ఫ్రాడ్ దేశాన్ని కుదిపివేశాయి. అలాగే ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకుల లావాదేవీలపై నీలినీడలు పరచుకున్న విషయం తెలిసిందే. ఇవి కోట్లాది రూపాయల రుణాలిచ్చిన తీరు అసలు నిబంధనలకు లోబడే ఉందా అని ఎకనామిస్టులు సైతం సందేహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో తగిన చర్యలు తీసుకునే అధికారం రిజర్వ్ బ్యాంకుకు లేదని ఉర్జిత్ పటేల్ ఇటీవల స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఎలాంటి అధికారం అవసరమో తాము తెలుసుకోదలిచామని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడొకరు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ కమిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ ను కూడా కొన్ని ప్రశ్నలు అడిగి బ్యాంకింగ్ రంగ లావాదేవీల  గురించి  సమాచారం సేకరించినట్టు చెబుతున్నారు.

Related News