రాజ్యసభలోనూ మోదీ హవా! జేడీయూ చేతికి డిప్యూటీ!

అత్యంత ఆసక్తికర పరిణామాల మధ్య రాజ్యసభ ఉపసభాపతి కుర్చీని ఎన్డీఏ దక్కించుకుంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు జరిగిన ఈ ఎన్నికలో ఇద్దరు సభ్యులు మాత్రమే గైర్హాజరయ్యారు. మొత్తం 230 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొన్నారు. వీరిలో 125 మంది జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ కి మద్దతుగా నిలబడ్డారు. ప్రతిపక్షాల తరపున నిలబడ్డ కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ కి 105 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో 20 ఓట్ల తేడాతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య ప్రకటించారు. కానీ.. మేజిక్ ఫిగర్ 123 కంటే కేవలం 2 ఓట్లు మాత్రమే అధికంగా తెచ్చుకుంది ఎన్డీఏ.

కూటమికి సంబంధించిన 93 మంది సభ్యులకు అదనంగా బీజేపీ పెద్దల భీకరమైన లాబీయింగ్ కారణంగా కావాల్సినంత మంది ఎన్డీయేతర సభ్యుల మద్దతు సైతం హరివంశ్‌కి దక్కింది. తమకు మెజారిటీ లేని రాజ్యసభలో సైతం సత్తా నిరూపించుకున్నామంటూ బీజేపీ పండగ చేసుకుంటోంది. ఈ ఎన్నికల్లో రెండు తెలుగు అధికార పార్టీలు చెరో వైపు నిలబడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ కి టీడీపీ మద్దతునిస్తే, ఎన్డీఏ అభ్యర్థికి తెరాస మద్దతు తెలిపింది. ఏపీ ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఓటింగ్ కి దూరంగా నిలబడింది.

బీహార్ నుంచి జేడీయూ తరఫున రాజ్యసభకు ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్.. సీఎం నితీష్ కుమార్ కి నమ్మిన బంటు. 62 ఏళ్ల వయసున్న హరివంశ్ మంచి విద్యావేత్త. బనారస్ యూనివర్సిటీలో చదువుకుని ఎకనామిక్స్ లో పట్టా పుచ్చుకున్నారు. ఒక జర్నలిస్టుగా కెరీర్ ని మొదలుపెట్టి.. పెద్దల సభ డిప్యూటీ చైర్మన్ స్థాయికి చేరారు. ఎన్నికవగానే.. గులాం నబీ ఆజాద్, ప్రధాని మోడీ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు.

ఇటు.. బీజేపీకి వ్యతిరేకంగా చిన్నా పెద్దా పార్టీలన్నిటినీ కూడగట్టి.. పెద్దల సభలో మోదీ ప్రతిష్ట మీద దెబ్బ కొడదామన్న కాంగ్రెస్ పార్టీ పాచిక ఈసారి పారలేదు. కాంగ్రెస్సేతర పార్టీల నుంచి అభ్యర్థిని బరిలో దింపివుంటే.. అన్ని పక్షాలూ మద్దతు తెలిపివుండేవని, ఆ విధంగా బీజేపీ హవాని తగ్గించే అవకాశం ఉండేదని చెబుతున్నారు. ఏదేమైనా.. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట పడే ఆ చివరాఖరి ఛాన్స్‌ని కూడా ప్రతిపక్షాలు మిస్ చేసుకున్నట్లయింది. రాజకీయంగా అనూహ్య ప్రాధాన్యత సంతరించుకున్న రాజ్యసభ డిప్యూటీ ఎన్నికని సైతం తమకు అనువుగా మలుచుకున్న బీజేపీ ఇదే ఊపుతో.. 2019 ఎన్నికల్లో దూసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది.

Related News