‘మహానటి’ సావిత్రి.. మేకింగ్ వీడియో

మహానటి సావిత్రి.. ‘బ్లాక్ అండ్ వైట్’ శకం నాటి గ్లామర్ ఐకాన్. హీరో ఎవరైనా ఆమె హీరోయిన్ అయితేనే సినిమాకు ‘హిట్టు గ్యారంటీ’ హోదా వచ్చేది. నిజం చెప్పాలంటే.. ఆమెతోనే ఇండియన్ సెల్యులాయిడ్ మీద ఫిమేల్ సూపర్ స్టార్ అనే ఇమేజ్ బిల్డ్ అయ్యింది. కానీ.. ఇవ్వాల్టి తరానికి, వర్తమాన ప్రేక్షక లోకానికి మహా అయితే ఆమె పేరు మాత్రమే తెలుసు. ఆమె ఘనత గురించి కొన్ని వయసులవారు మాత్రమే చెప్పగలరు. ఈ నేపథ్యంలో ‘మహానటి’ పేరుతో సావిత్రి బయోపిక్‌కి నడుం కట్టింది.. వైజయంతీ మూవీస్ సంస్థ. ఇదొక దుస్సాహసమేనంటూ మొదట్లో చాలామంది అభిప్రాయపడ్డారు.

వర్ధమాన దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘మహానటి’.. నాటి హంగుల్ని సంతరించుకోవాలంటే ఓ మోస్తరు ఎక్కువగానే కష్టపడాలి. స్క్రిప్ట్ ఒక్కటే చేతుల్లో పెట్టుకుని సెట్స్ మీదకెళితే కుదిరే పని కాదు. అప్పటి తరం మేకర్స్ నుంచి పాఠాలు నేర్వాలి.. ప్రత్యేక తర్ఫీదు పొందాలి. కేవలం నటుల ఎంపిక కోసమే ఏడాదిన్నర శ్రమ పడాల్సివచ్చింది. సమంత, విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే లాంటి కుర్ర వాళ్ళ నుంచి ‘ఒరిజినల్’ పెర్ఫామెన్స్‌ని రాబట్టుకోవాలంటే ఇంకెంత శ్రమ పడాలి? కానీ.. ఇటువంటి కష్టాలన్నింటినీ ఒక్కటొక్కటిగా దాటుకుంటూ ముందుకెళ్తోంది ‘మహానటి’ వర్కింగ్ టీమ్. ఇప్పటికే సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్, ఆమె భర్త జెమినిగణేశన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ విపరీతంగా ‘సింక్’ అయ్యారంటూ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

ఇటేవలే విడుదలైన ‘మూగ మనసులు’ లీడ్ సాంగ్ ఆపాత మధురాల్ని గుర్తుకు తెచ్చింది. మ్యూజిక్, సెట్స్, పెర్ఫామెన్స్ పరంగా సినిమా ఎలా ఉంటుందన్న క్లారిటీనిచ్చేసింది. కీర్తి-దుల్ఖన్ కాంబో చూడముచ్చటగా ఉందంటూ ఈ సినిమాకు టాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి ఉమ్మడి మద్దతు దొరుకుతోంది. ఇదిలా ఉంటే.. సావిత్రి జీవిత విశేషాలు, సావిత్రి వ్యక్తిగతం, సావిత్రి అభిరుచులు ఒక్కటొక్కటిగా రివీల్ చేస్తూ.. సినిమాకు ఇండైరెక్ట్ ప్రమోషన్ కూడా రాబట్టుకుంటోంది వైజయంతీ మూవీస్. సావిత్రికి కార్ల మీద మోజు ఎక్కువని.. చెన్నైలో ఆమెకున్న ‘వింటేజ్ కార్ల కలెక్షన్’ గురించి గొప్పగా చెప్పుకుంటారని చెబుతూ ఒక ప్రమోషనల్ పిక్ రిలీజ్ చేసింది యూనిట్.

మే9న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మహానటి’ మూవీ.. ముందటి సినిమా తరాన్ని నేటి తెర మీద ఆవిష్కరించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Related News