ఈ సంక్రాంతి నాదే.. నాగార్జునలో కొత్త జోష్..

‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘హలో’ ఎంత సక్సెస్ నిచ్చాయన్న క్లారిటీ లేకపోయినా.. ఈ పండక్కి వచ్చే ‘రంగులరాట్నం’ మీదయితే అన్నపూర్ణ స్టూడియోస్‌ మంచి ధీమాతో వుంది. రాజ్‌తరుణ్‌ హీరోగా, చిత్ర శుక్లా హీరోయిన్‌గా తెర‌కెక్కిన ‘రంగుల‌రాట్నం’ శ్రీరంజని అనే దర్శకురాలికి డెబ్యూ మూవీ. జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్‌కి రెడీ అవుతున్న సందర్భంలో నాగార్జున ప్రెస్ ముందుకొచ్చారు. నటుడిగా కంటే, నాన్నగా, నిర్మాతగానే బిజీగా మారిన నాగ్.. రంగుల రాట్నం ద్వారా.. రాజ్ తరుణ్ ని కూడా బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు.

సినిమా నెలరోజుల ముందే రెడీ అయినా.. లక్కీగా సంక్రాంతి డేట్ దొరికింది.. ఈ సీజన్ నాకు బాగా కలిసొస్తుందని భావిస్తున్నా.. అంటూ నాగ్ ఎగ్జయిటింగ్ గా చెప్పారు. మిగతా రెండు పెద్ద సినిమాల ‘నెగిటివ్ రిజల్ట్’ నేపథ్యంలోనే ఆయన ఇలా జోష్ తో ఉన్నారా అంటూ మీడియా మిత్రులు గొణుక్కోవడం కనిపించింది. రంగులరాట్నం సినిమా కంటెంట్ మీద కూడా మంచి నమ్మకంతో వున్నారు నాగార్జున.

”నేనూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియ కలిసి వంద క‌థ‌లు వినుంటాం.. చివరకు ఈ రంగులరాట్నానికే గ్రీన్ సిగ్న‌ల్ దొరికింది. తల్లీకొడుకులుగా రాజ్ తరుణ్, సితార సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. శ్రీరంజని కొత్తమ్మాయే అయినా పరిణితి చెందిన డైరెక్టర్ లా సినిమాను తీర్చిదిద్దింది. ఎవరెంత కష్టపడ్డా.. సక్సెస్ క్రెడిట్ మాత్రం నాదే” అంటూ ధీమాగా చెప్పాడు నాగార్జున. నాగ్ అంచనా ప్రకారం.. అసలుసిసలు సంక్రాంతి సినిమా రంగుల రాట్నమే అయితే.. అన్నపూర్ణ బేనర్ పంట పండినట్లే!

Related News