India / General
మీ సేవింగ్స్ ఖాతాలో ఎంతుంది? మోదీ మళ్ళీ కన్నేశారు!

ప్రధాని మోదీ ప్రభుత్వం పెద్ద బాంబునే విసరడానికి రెడీ అవుతోంది. బ్యాంకుల్లో సామాన్యుడు దాచుకున్న సొమ్ముకు ఎసరు పెట్టడానికి కసరత్తు చేస్తోంది. ఆర్ధిక సంస్థలు, బ్యాంకుల్లో తమ డబ్బు భద్రంగా ఉంటుందని సేవింగ్స్ లోనో, ఇతరత్రానో డిపాజిట్ చేస్తే.. ఆ డిపాజిట్ సొమ్మును అవి గప్ చుప్ గా ఎగరేసుకుపోవడానికి దొడ్డిదారిన సన్నాహాలు చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..ఈ ఏడాది జూన్ లో " ఫైనాన్షియల్ రిసోల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్లు-2017 " పేరిట ఓ బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్ వద్ద పెండింగ్ లో ఉంది. బ్యాంకులు పాటించలేకపోతున్న కొన్ని నిబంధనలకి కొత్త రూపు కల్పించి వాటిని ఈ బిల్లులో ఉద్దేశించారు. బలహీనమైన బ్యాంకులను ఆదుకునేందుకు,,వాటి మనుగడ కొనసాగేలా చూసేందుకు (అవి నష్టాల బారిన పడకుండా చూడడానికి) డిపాజిటర్ల డబ్బును అవి వినియోగించుకోవడానికి వీలు కల్పించాలన్నదే ఈ బిల్లు ముఖ్యోద్దేశం.

 

కనీసం ఖాతాదారుని అంగీకరమైనా లేకుండానే, అతనికి తెలియజేయకుండానే అతని డిపాజిట్ సొమ్మును అవి వినియోగించుకోవడానికి విస్తృత అధికారాలు కల్పిస్తున్న ఈ బిల్లు చట్టమైతే..ఇక సామాన్యుడి నడ్డి విరగడం ఖాయం. ఉదాహరణకు ఓ బ్యాంకులో డిపాజిట్ అయిన సొమ్ముకు నిర్దిష్ట పరిమితి మేరకు ఇన్సూరెన్స్ వెసులుబాటు ఉంటుంది. 1961 నాటి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ చట్టం ప్రకారం.. మన సొమ్ముకు సంబంధించి బ్యాంకులో ఓ లక్ష రూపాయలు ఉందనుకుంటే..దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ ను చెల్లించలేని బ్యాంకులకు ఈ బిల్లు " వర ప్రదాయినే " అవుతుంది. ఈ బిల్లులోని 52 సెక్షన్ కింద ఈ ఇన్సూరెన్స్ కూడా రద్దయిపోతుంది. అసలు మీకు మేమిచ్చే సొమ్మేదీ లేదని బ్యాంకులు ఖాతాదారునికి చెప్పవచ్చు. అలాగే మన సేవింగ్స్ ఖాతాలను అవి ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చుకోవచ్చు. అంటే మనం కష్టపడి దాచుకున్న డబ్బు మీద మనం ఆశలు వదులుకోవాల్సిందే. ఈ బిల్లు గురించి తెలిసిన సేవింగ్స్ ఖాతాదారుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. అప్పుడే చాలాచోట్ల మెల్లగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ..కాస్త " తీవ్రత " తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ బిల్లుకు సంబంధించి.. కొంతవరకు వెనుకంజ వేసే అవకాశం ఉందని తన ట్విటర్ లో తెలిపారు. బిల్లు పార్లమెంట్ వద్ద పెండింగ్ లో ఉందని, దీనిపై సభలో చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఏమైనా.. ఎఫ్ ఆర్ డీ ఐ అని వ్యవహరించే ఈ బిల్లు చట్టమైందా ? ఇక సామాన్యుడికి అంతే సంగతులు !

 

Read Also

 
Related News