పవన్ సర్టిఫికెట్ నాకెందుకు? మండిపడిన లోకేష్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనపై చేసిన ఆరోపణలకు ఏపీ మంత్రి నారా లోకేష్ కాస్త ఆలస్యంగానైనా స్పందించారు. తనమీద పవన్ చేసిన ఆరోపణలకు ఆయన  ఆధారాలు చూపాలన్నారు. మంగళవారం విజయవాడలో మీడియాతో ముచ్చటించిన ఆయన.. పవన్ పై పరువు నష్టం వేసే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందన్నారు. శేఖర రెడ్డి అక్రమాలతో నాకు సంబంధాలు ఉన్నాయని పవన్ అంటున్నారు.. ఆయన దుమ్మెత్తి పోస్తే నేను దులుపుకోవాలా అని లోకేష్ ప్రశ్నించారు. తనతో కలిసి ఫోటోలో ఉన్నది ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావు అని చెప్పిన ఆయన.. రామారావును శేఖర రెడ్డి అని చెబుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారు.. ఎవరు ఏంటో వాళ్లకు బాగా తెలుసు.. పవన్ సర్టి ఫికెట్ నాకు అవసరం లేదు అని లోకేష్ పేర్కొన్నారు.

నేను అవినీతికి పాల్పడినట్టు పవన్ దగ్గర ఆధారాలుంటే నేరుగా నాకే ఫోన్ చేసి అడగొచ్చుగా..నా ఫోన్ నెంబరు ఆయన దగ్గర ఉంది అన్నారు. ప్రతి ఏటా తన ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్నా నని, చిల్లిగవ్వ ఎక్కువున్నా తీసుకోండి అని అన్నారాయన, అప్పుడు జగన్..ఇప్పుడు పవన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.” నేను పుట్టే నాటికే మా తాత సీఎంగా ఉన్నారు.  నేను చాలా పద్దతిగా, క్రమ శిక్షణగా పెరిగాను. అలాంటి  నేను మా తాత పరువు తీశానని పవన్ అనడం చాలా దారుణం..నాన్నగారు రాష్ట్రంకోసం అహర్నిశలూ కష్టపడుతున్నారు. ఆయనకే రేటింగ్ ఇచ్చే స్థాయా అని పవన్ ది అని ఆయన దుయ్యబట్టారు.

Related News