ఒంటరిపోరే.. వాళ్లకి 20సీట్లు రావు.. కేసీఆర్ ముందస్తు సిగ్నల్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందస్తు ఎన్నికలు, నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధి, విపక్షాలపై ఘాటు విమర్శలు.. ఇలా అనేక విషయాలపై పూర్తి స్థాయి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. రాహుల్ పర్యటన, పార్టీ కార్యవర్గ సమావేశానికి సంబంధించి అనేక విషయాలపై వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం, ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాసిన స్క్రిప్ట్స్ కాకుండా సొంతంగా మాట్లాడ్డం నేర్చుకోవాలంటూ రాహుల్ కు చురకలంటించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై కామెంట్ చేసిన రాహుల్ కు, అవసరమైతే కట్టిన ఇళ్లను చూపిస్తామన్నారు. కుటుంబపాలన గురించి రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఢిల్లీ నుంచి ఆదేశాలు రానిదే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏ నిర్ణయం తీసుకోలేరని విమర్శించారు.

వచ్చే సాధారణ ఎన్నికలలో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబరులోనే పార్టీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తామని, మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని, అభ్యర్థుల ప్రకటనకు అవసరమైన వేదికలను కీలక నేతలు చూస్తారని చెప్పారు. సెప్టెంబర్ 2న ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో భారీ ఎత్తున ప్రగతి నివేదన సభ నిర్వహిస్తామని, 1500 ఎకరాల విస్తీర్ణం ఉండే చోటే ఈ సభ నిర్వహిస్తామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం ఇదని తెలిపారు. ఎన్నికల గురించి ఇప్పటికే ఆరు సర్వేలు చేయించానని, వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. ఇప్పటికే ఎన్నికల సమయంలోకి వచ్చామని అన్నారు. నిర్ణీత సమయానికి ఆర్నెల్ల ముందు జరిగే ఎన్నికలు ముందస్తు ఎన్నికలు కాదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి ఏర్పాటుగా థర్డ్ ఫ్రంట్ నిర్మాణం కొనసాగుతుందన్నారు.

Related News