జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎజెండాతో ముందుకు: కేసీఆర్

జాతీయ రాజకీయాల్లో పెద్ద ఎజెండాతో ముందుకు పోతున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తమది తృతీయ ఫ్రంట్ కాదని తమది ప్రజల ఫ్రంట్ అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఆరేళ్లు మినహా కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయని వారి లోపభూయిష్టమైన విధానాలే వల్లే దేశం ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటుందన్నారు.

దేశవ్యాప్తంగా ఏ పార్టీ కలిసి వచ్చినా కలుపుకుపోతామని.. అంతా ఏకతాటిపై నిలిచి దేశాన్ని రైతులను కాపాడదామని పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కు మద్దతు పలకాలని కేసీఆర్ కోరారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సీరియస్ గా దృష్టి పెట్టిన కేసీఆర్, శుక్రవారం బెంగుళూరులో మాజీ ప్రధాని, జనతాదళ్ (లౌకిక) జాతీయ అధ్యక్షుడు హెచ్.డీ.దేవెగౌడ, మాజీ సీఎం, జేడీ-ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు. కేసీఆర్ వెంట టీఆర్‌ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్, నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు.

తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు దేవెగౌడ ఉద్యమానికి మద్దతిచ్చారని.. తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చేందుకు నిర్వహించిన భారీ సభలో కూడా దేవెగౌడ స్వయంగా పాల్గొన్నరని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.

కావేరీ జలాల సమస్యకు ఇంత వరకు పరిష్కారం దొరకలేదని.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ ఇప్పటి వరకు నీటి సమస్యకు పరిష్కారం చూపలేదని కేసీఆర్ విమర్శించారు.

Related News