నిన్న నీరవ్.. నేడు కనిష్క్.. పరారీలో ఓనర్స్

బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలను రుణాలుగా తీసుకుని పారిపోతున్నవాళ్లు బండారం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. ఇప్పటికే పంజాబ్ బ్యాంక్‌కి రూ. 11 వేల కోట్లకు కన్నం పడింది. తాజాగా ఎస్‌బీఐ సహా మరో 14 బ్యాంకులకు రూ. 824 కోట్ల మేరా కుచ్చు టోపీ పెట్టింది కనిష్క్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎగవేత వ్యవహారంపై ఎస్‌బీఐ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని టి.నగర్‌లో రిజస్టర్ అయిన కనిష్క్ గోల్డ్ సంస్థకు భూపేష్‌కుమార్ జైన్, అత‌డి భార్య నీతా జైన్ ప్రమోటర్లు, ఓనర్స్ కూడా. ఇంకా చెప్పాలంటే ఆ సంస్థకు డైరెక్టర్లు కూడా వీళ్లే! గతేడాది ఏప్రిల్‌ నుంచి కనిష్క్‌ జ్యూయలరీ సంస్థ.. రుణాలు తీసుకున్న 14 బ్యాంకులకు డబ్బులు కట్టడం నిలిపివేసింది. ఇదేంటని ప్రశ్నించేందుకు వెళ్లిన బ్యాంకు అధికారులకు షాపులన్నీ మూసి కనిపించాయి.

(ఈ సంస్థకు ఎస్‌బీఐ- రూ.215 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు- రూ.115 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- రూ.50 కోట్లు, సిండికేట్‌ బ్యాంకు- రూ.50 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా- రూ.45 కోట్లు, ఐడీబీఐ, యూకో, తమిళనాడ్‌ మెర్కంటైల్‌ బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌షీ, ఐసీఐసీఐ, సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కార్పొరేషన్‌ బ్యాంక్‌లు కోట్ల మేరా రుణాలు ఇచ్చాయి). ఐతే, కనిష్క్.. రుణాలు చెల్లించకపోవడంతో యాజమానిని రుణ ఎగవేతదారుడిగా ప్రకటిస్తూ ఎస్‌బీఐ 2017 నవంబర్ 11న ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లింది. ఇదిలావుండగా కనిష్క్ జ్యూయలరీ రికార్డులను తారుమారు చేసి రాత్రికి రాత్రే షాపులను మూసివేసిందని వెల్లడిస్తూ జనవరి 25న సీబీఐకి ఫిర్యాదు చేసింది ఎస్‌బీఐ. రుణంతోపాటు వడ్డీతో కలుపుకుంటే బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ.1000 కోట్ల పైనే! దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. జైన్ ఫ్యామిలీ ఆచూకీ తెలుసుకోలేకపోతున్నామని, వాళ్లు ప్రస్తుతం మారిషస్‌లో ఉన్నట్లు బ్యాంకింగ్ వ‌ర్గాల అంచనా!

Related News