ఆఖరినిమిషంలో జగన్ ట్విస్ట్

వైసీపీ అధినేత జగన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏకి ఓటేసే ప్రసక్తే లేదని ప్రకటించిన వైసీపీ.. ఆ తర్వాత ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడానికి జరిగే ప్రయత్నాలకు సైతం తోడుగా ఉంటామంది. మరికాస్సేపట్లో ఎన్నిక జరుగుతుందనగా.. పోలింగ్‌కి దూరంగా ఉంటామంటూ మరో ఆకస్మిక నిర్ణయం తీసుకుంది ఆ పార్టీ. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తమ తాజా నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు కూడా. డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి అభ్యర్థిని నిలబెట్టబోమని చెబుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆఖరి రోజు క్యాండిడేట్ ని బరిలో దించిందని.. అందుకే మద్దతు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చామని చెప్పారాయన. రాజ్యసభలో విజయసాయితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో మెంబర్ గా వున్నారు.

రెండు జాతీయ పార్టీలతో వ్యూహాత్మక బంధాల్ని నెరపుతూ వస్తున్న జగన్.. ప్రతి చిన్నపాటి నిర్ణయాన్నీ ఆచితూచి తీసుకుంటున్నారు. ఎంపీల రాజీనామా కారణంగా ఇటీవల లోక్‌సభలో అవిశ్వాసం ఓటింగ్‌కి సైతం నోచుకోలేదు వైసీపీ. ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో ఓటింగ్‌కి దూరంగా ఉండాలన్న నిర్ణయంతో సభలో ఉనికిని చాటుకోలేకపోయింది. కానీ.. రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలో వైసీపీ అనుసరించిన స్ట్రాటజీ పరోక్షంగా బీజేపీకి ప్రయోజనకరమన్న పాయింట్ లేవదీస్తోంది తెలుగుదేశం పార్టీ.

READ ALSO

Related News