బేఫికర్.. రైళ్లలో మహిళా ప్రయాణీకులకు శుభవార్త!

2018ని మహిళా సంరక్షణ సంవత్సరంగా ప్రకటించిన ఇండియన్ రైల్వేస్.. ఆ దిశగా అనేక చర్యలు కూడా చేపట్టింది. ప్రయాణీకుల ఫీడ్‌బ్యాక్‌ని పరిశీలించి.. విమెన్ ప్యాసింజర్స్ సేఫ్టీ కోసం నడుం బిగించింది. రైళ్లలో మహిళలు సురక్షితంగా, క్షేమంగా ప్రయాణించగలిగేలా అన్ని రకాల ప్రయత్నాలూ చేయాలన్నది ప్రణాళిక. మహిళా బోగీలని రైలు రెండు చివరలా కాకుండా మధ్య భాగంలో ఏర్పాటు చేయాలన్నది ఇందులో మొదటి మరియు కీలక నిర్ణయం. ఆగంతకులు ఎంటరవ్వకుండా కిటికీలకు ఇనుప కంచె ఏర్పాటు చేయడం, మహిళా బోగీలు ప్రత్యేక రంగులో ఉండేలా చూడడం లాంటివి మరిన్ని చర్యలు.

ముంబై సబర్బన్ రైల్వేస్ మరో అడుగు ముందుకేసి.. ‘ఐవాచ్ రైల్వేస్’ పేరుతో ఒక ఆండ్రాయిడ్ యాప్ రూపొందించింది. ఆపద సమయంలో మహిళలు ప్రెస్ చెయ్యడానికంటూ ఏర్పాటైన ఎలెర్ట్ బటన్ దీని ప్రత్యేకత. లేదా.. తమ ఫోన్లోని పవర్ బటన్‌ని నాలుగు సార్లు ప్రెస్ చేసినా.. ఆర్ఫీఎఫ్ పోలీసులకు సమాచారం వెళ్ళిపోతుంది. వీటికి తోడుగా.. మహిళా బోగీల్లో ప్రత్యేకంగా ఒక ‘పానిక్ బటన్’ ఏర్పాటు చేయాలన్నది రైల్వేస్ ఆలోచన. ఎలెక్ట్రిక్ స్విచెస్‌కి దగ్గరగా వుండే ఈ ఎర్రటి బటన్ ప్రెస్ చేస్తే.. వెంటనే గార్డ్‌కీ, దగ్గర్లోని రైల్వే స్టాఫ్‌కీ బోగీ వివరాలు చేరతాయి. ఈ ఏడాది చివరికల్లా అన్ని రైళ్లలోనూ ‘పానిక్ బటన్’ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ భరోసానిస్తోంది.

Related News