‘గీత గోవిందం’ సీన్లు లీక్.. సూత్రధారి అరెస్ట్

ఎన్ని చట్టాలు చేసినా, ఆ చట్టాలకు ఎన్ని కోరలు బిగించినా.. సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం వెంటాడుతూనే వుంది. సినిమా విడుదలకు ముందే టీజర్లు, ట్రైలర్లకు సైతం ఈ పైరసీ బెడద తప్పడం లేదు. షూటింగ్ స్పాట్స్ నుంచే నేరుగా సోషల్ మీడియాలొకెక్కేస్తున్న ఒరిజినల్ కంటెంట్‌ని.. ఇక ఎలా కాపాడుకోవడం అనే టెన్షన్ పట్టుకుంది తెలుగు చిత్ర పరిశ్రమకు. ఈ దడ ఇలా కొనసాగుతుండగానే.. మరో భారీ పైరసీ ముఠా గుట్టు రట్టయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన ఒక సైబర్ గుంపు.. ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కింది.

హైదరాబాద్‌లో రాజేష్ అనే ఎడిటర్‌ని అరెస్ట్ చేసి.. అతడి దగ్గరనుంచి ఒక హార్డ్‌డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఫిలిమ్‌నగర్‌లో డేటా డిజిటల్ బ్యాంక్ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజేష్ ఎడిటింగ్ కోసం ఇచ్చిన హార్డ్ డిస్క్‌లోని డేటాను తన ల్యాప్‌టాప్‌లోకి ఎక్కించుకున్నాడని.. అనంతరం తాను కాపీ చేసిన గీతగోవిందం సినిమాను.. పెన్‌డ్రైవ్ ద్వారా తన స్నేహితులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు పంపాడని తెలిసింది. అతడి నుంచి 3 ల్యాప్‌టాప్‌లు, 3 పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం  చేసుకున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన ‘గీత గోవిందం’ సినిమా పైరసీకి సంబంధించి కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు గుంటూరు అర్బన్ ఎస్సీ విజయరావు తెలిపారు.

గుంటూరు సమీపంలోని రెండు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు సినిమా సీన్లను షేర్ చేసుకున్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులపై పెదకాకాని పోలీస్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. (గీత గోవిందం మూవీ ఈనెల 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.)  మరో షాకింగ్ న్యూస్ ! ఈ సినిమా ప్రింట్ కాపీని అమరావతి పరిధిలోని తాడేపల్లి.. కేఎల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థిని లీక్ చేసినట్టు గుంటూరు పోలీసులు గుర్తించారు. ఆమె తన ఫ్రెండ్స్ అందరితో దాన్ని పంచుకుందని పోలీసులు తేల్చారు.

READ ALSO

Related News