India / General
ఆధార్ లింక్ పొడిగింపు.. షరతులు వర్తిస్తాయి

బ్యాంక్ అకౌంట్‌లతో సహా వివిధ ప్రభుత్వ పథకాలకు తప్పనిసరిగా ఆధార్ లింక్ చేసే డెడ్ లైన్ (చివరి తేదీ) ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే ఇప్పటివరకు ఆధార్ లేనివారికే ఈ పొడిగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ ను జారీ చేస్తుందని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. అయితే ఆధార్ అనుసంధానం తప్పనిసరి అన్న నిబంధనను సవాల్ చేస్తూ
కోర్టుకెక్కిన పిటీషనర్లు.. డెడ్‌లైన్ పొడిగింపునకు షరతులు విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆధార్ ఉన్నవారికి కూడా ఇది తప్పనిసరి కాదనేలా వారిని అనుమతించాలన్నదే తమ అభ్యర్ధన అని పిటిషనర్ల తరుపు న్యాయవాది ఉదయాదిత్య బెనర్జి పేర్కొన్నారు. ఆధార్ పథకాన్నే తాము సవాల్ చేశామని, ఈ విషయంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. కాగా వచ్చే వారం న్యాయస్థానం మళ్ళీ ఈ పిటీషన్‌ను విచారణకు చేపట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది. అటు.. న్యాయస్థానం ఆదేశాల మేరకు మొబైల్ సర్వీసులకు ఆధార్ అనుసంధానం చివరి తేదీ వచ్చే ఫిబ్రవరి 6 వరకు ఉంటుందని అంటున్నారు.

 

 

 

 

Read Also

 
Related News