తెలంగాణలో రెడ్ అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు, రాబోయే ఒకటీ రెండు రోజుల్లో వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సీఎం కేసీఆర్. ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని, ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావాన్ని సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డిలతో సీఎం మాట్లాడారు. ఇప్పటికే నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో వర్షం, వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, స్థానిక అధికారుల సమన్వయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ జిల్లాల్లో, నియోజకవర్గాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండి, అధికారులు, పోలీసుల సహకారంతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సెక్రటేరియట్‌లో కూడా సీనియర్ అధికారి నేతృత్వంలో 24 గంటల పాటు వర్షాల పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నచోట అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు.

 

 

Related News