‘గూఢచారి’ సారీ చెబుతాడా?

టాలీవుడ్ ‘పెద్దన్న’గా సినిమా వారందరికీ తల్లో నాలుకలా మెలిగే సీనియర్ డైరెక్టర్-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మళ్ళీ వార్తల్లోకి వచ్చేశారు. మనసుకు తోచినట్లు ముక్కుసూటిగా మాట్లాడే అలవాటున్న ఆయన ఒక యువనటుడిపై చెలరేగిపోయారు. ప్రస్తుతం.. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ‘గూఢచారి’ మూవీ ఆలిన్‌ఆల్ అడివి శేష్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘అంకుల్.. ఓ మంచి రోల్ వుంది వేస్తారా’ అని బతిమిలాడితే ‘గూఢచారి’లో నటించానని.. కానీ.. నా పెద్దరికాన్ని గౌరవించడం అటుంచి కనీస మర్యాద లేకుండా ప్రవర్తించాడని అడివి శేష్‌పై దుమ్మెత్తి పోశారు తమ్మారెడ్డి భరద్వాజ్. గట్టి ఆధారం లేకుండా ఏదీ మాట్లాడరు తమ్మారెడ్డి. కానీ.. అడివి శేష్‌పై అంతలా చెలరేగిపోవడం వెనుక గట్టి కారణం ఏమై ఉంటుంది? అన్న ఆసక్తితో అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

‘షూట్ ముగిసిన తర్వాత నన్ను కలిసి.. ఫస్ట్ కాపీ చూపిస్తానని మాటిచ్చాడు.. కానీ సినిమా విడుదలయ్యే దాకా నన్ను కనీసం ఒక ఆర్టిస్టుగా కూడా లెక్కలోకి తీసుకోలేదు. షో వేసినప్పుడు ఒక్కసారి కూడా పిలవలేదు” అంటూ నిప్పులు తొక్కేస్తున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. విపరీతమైన యూత్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న అడివి శేష్‌ది సహజంగానే ‘రూడ్’ మెంటాలిటీ! అతడి ప్రవర్తన అంతేనంటూ సర్దుకొనిపొయ్యే వాళ్ళు టాలీవుడ్‌లో అనేకమంది. ఇదేవిధంగా తమ్మారెడ్డ్డి భరద్వాజ్ కూడా సంయమనం వహించి మౌనంగా ఉండిపోవాల్సింది.. అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమా సక్సెస్ కొట్టిన క్రమంలో ఆ ‘మత్తు’లోనే వుండిపోయిన అడివి శేష్ ఇప్పటివరకూ ఈ విషయంపై స్పందించలేదు. నింపాదిగా.. రేపోఎల్లుండో.. ‘సారీ అంకుల్’ అంటూ ఒక ట్వీట్ చేసి చేతులు దులుపుకుంటాడేమో !

Related News