కాంగ్రెస్‌తో కలిస్తే లాభమే! బాబు చేతికి కీలక రిపోర్ట్!

పొత్తులు-కత్తులపై క్లారిటీ ఇచ్చేందుకు ఎట్టకేలకు సిద్ధమయ్యారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. కేసీఆర్ ‘ముందస్తు’ సంకేతాలతో అటు తెలంగాణ రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో నేను సైతం అంటూ చంద్రబాబు కూడా స్పీడ్ పెంచేశారు. మంగళవారం సాయంత్రం తర్వాత.. అందుబాటులో వున్న కీలక నేతలతో భేటీ ఏర్పాటు చేశారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహమే ప్రధాన ఎజెండాగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహరించాల్సిన తీరు మీద భేటీలో లోతైన చర్చజరిగింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కర్ణాటక సీఎం కుమారస్వామి పట్టాభిషేకం సమయంలో రాహుల్ గాంధీతో చంద్రబాబు భుజం కలిపింది మొదలు.. ఈ ‘రహస్య స్నేహం’పై రూమర్లు పెరిగిపోయాయి. వాటికి చెక్ పెట్టాలంటే బాబు స్పందించక తప్పని పరిస్థితి!

రాహుల్‌గాంధీ ఓకె చెబితే తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటు.. రాహుల్‌గాంధీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో జరిగిన భేటీలో చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పాల్గొనడంపై దుమారం రేగింది. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషణలు వచ్చాయి. ప్రతిపక్ష నేత జగన్ సైతం ఈ విషయాన్ని పాదయాత్రలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. మంగళవారం నాటి భేటీ తర్వాత తెలుగుదేశం పార్టీలో పొత్తు విషయమై ఒక స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. భేటీలో పార్టీ నేతలు సైతం ‘కాంగ్రెస్‌తో పొత్తుకు సానుకూల పరిస్థితులు’ ఉన్నట్లు అధినేతకు వివరించారు. 2014తో పోలిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేక భావం బాగా తగ్గిందన్నది వాళ్ళ అంచనా.  తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్‌తో కలుస్తారా? లేక.. రెండు రాష్ట్రాల్లోనూ సీట్ల సర్దుబాటు జరుగుతుందా? అన్న సందేహం కొద్దిగానైనా తీరే అవకాశం వుంది. తుది నిర్ణయం ప్రకటించకపోయినప్పటికే.. పొత్తుపై ప్రాధమిక అంచనాకైతే వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related News