జాదూగర్ వస్తున్నాడు.. ఇద్దరు చంద్రులకూ ఒక్కటే చెక్!

ఈశాన్య రాజకీయ పవనాల్ని బీజేపీకి పూర్తి అనుకూలంగా మార్చిన అచ్చమైన రాష్ట్రీయ స్వయం సేవకుడు రామ్ మాధవ్. ఇప్పుడు కాదు ఎప్పట్నుంచో ఈయన ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ లుక్స్ లో వున్నారు. జమ్మూ కాశ్మీర్ లాంటి మైనారిటీ ప్రధాన రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలు తొడిగినప్పుడే రామ్ మాధవ్ తన పవరేంటో చూపించుకున్నారు. ఇప్పుడు దశాబ్దాల తరబడి కామ్రేడ్ల కంచుకోటగా పేరుబడ్డ త్రిపురను సైతం కమలం ఖాతాలో జమ చేసి.. మరోసారి రొమ్ములు విరుచుకు నిలబడ్డాడు. పక్కా ‘పొలిటికల్ స్ట్రాటజిస్ట్’గా స్థిరపడిపోయిన రామ్ మాధవ్ మీద ఇప్పుడు దేశ రాజకీయ వర్గాలన్నీ దృష్టి పెట్టేశాయి.

‘త్రిపురలో 40 సీట్లు గెలుస్తామంటే మోదీయే నమ్మలేదు’ అంటున్న రామ్ మాధవ్.. తాను త్రిపురను ఎలా గెలుచుకొచ్చానో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. చివరి మూడు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితిని బీజేపీకి అనుకూలంగా మార్చేశామని చెప్పుకొచ్చారు. త్రిపురలో ఎంత చక్కటి పాలన అందించినా, చివరి ఆరు నెలల్లో తాను అవలంబించిన వ్యూహం కారణంగా మొత్తం పరిస్థితి తారుమారైందన్నారు. ప్రచార సరళి, ‘మూడ్ ఆఫ్ ది ఓటర్’ని పసిగట్టి దాన్ని మార్చగలిగే నేర్పరితనం.. ఇవి మాత్రమే ఫలితంపై ప్రభావం చూపుతాయట. అంటే.. త్రిపురలో మాణిక్ సర్కార్ పాలన సక్రమంగానే ఉందని.. ప్రభుత్వ వ్యతిరేకత లేకపోయినా.. దాన్ని కృత్రిమంగా కల్పించి ఓట్లుగా మార్చుకున్నామని చెప్పారు రామ్ మాధవ్.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో వున్న రామ్ మాధవ్.. అమిత్ షా ‘ట్రబుల్ షూటింగ్’ టీంలో ఒకరు. ఈయన పక్కా తెలుగు మూలాలున్న వ్యక్తి. గోదావరి నీళ్లు తాగి పెరిగిన రాజమండ్రి ముద్దుబిడ్డ. రేపటిరోజున రామ్ మాధవ్ ని తెలుగు రాష్ట్రాల ఇన్ ఛార్జ్ గా నియమిస్తారంటూ వార్తలొస్తున్నాయి. ఏపీలో బీజేపీతో టీడీపీ తెగతెంపులు, తెలంగాణాలో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ హెచ్చరికల్లాంటి కీలక పరిణామాల నేపథ్యంలో.. ‘రామ్ మాధవ్ నియామకపు’ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. త్రిపురలో మాణిక్ సర్కార్ లాంటి స్వచ్ఛమైన ముఖ్యమంత్రి మీదే టన్నులకొద్దీ ‘ప్రభుత్వ వ్యతిరేకత’ పుట్టించిన రామ్ మాధవ్.. తెలుగు రాష్ట్రాల మీద కూడా ఏదో ఒక గొప్ప ప్రయోగం చేస్తారన్న భయాలు రెండు అధికార పార్టీల్లోనూ నెలకొన్న మాట నిజం.

READ ALSO

Related News