మోదీ ఐరన్ హ్యాండ్.. రేపటినుంచే ‘ఆపరేషన్ డీఎంకే’?

మోదీ చెయ్యి వేస్తే.. అది రాంగై పోదన్న మాట కొద్దికొద్దిగా గట్టిపడుతోంది. అప్పుడు.. సహచరిని పోగొట్టుకుని దుఃఖిస్తున్న శశికళను ఓదార్చుతూ ‘చెయ్యేసిన’ మోదీ అత్యంత నాటకీయ పరిణామాల్ని నడిపించి అమ్మ పార్టీ అన్నాడీఎంకేని చెరపట్టేశారు. ప్రస్తుతం తమిళనాట అధికార పార్టీ బీజేపీ వెన్నుదన్నుతోనే నడుస్తోందన్నది ఒక బహిరంగ రహస్యం. ఇప్పుడు.. తండ్రిని కోల్పోయిన స్టాలిన్‌ని ఓదార్చి వెళ్లిన మోదీ రేపు ఏం చెయ్యబోతున్నారన్నది తాజా పొలిటికల్ సస్పెన్స్!

ఒక్కమాటలో చెప్పాలంటే.. తమిళనాట ఇప్పుడున్న రాజకీయ శూన్యత గతంలో ఎప్పుడూ లేదు. కేవలం 20 నెలల గ్యాప్‌తో ఇద్దరు ఉద్దండ నేతలు కనుమరుగైపోవడంతో ద్రవిడ గడ్డ ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ‘రేపటి నాయకుడు’ ఎవరన్న ప్రశ్న చాలా పెద్దదిగా కనబడుతోందక్కడ. 1970 నుంచి ఆ రెండు ద్రవిడ పార్టీల పిడికిళ్లు దాటి బైటికెళ్లని అధికారం.. రేపటిరోజున అన్యాక్రాంతం కాదన్న గ్యారంటీలు ఎవ్వరూ ఇవ్వలేక పోతున్నారు. జాతీయ పార్టీలకు చోటివ్వకుండా.. తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న ద్రవిడ రాజకీయం.. ఇప్పుడు చీకటి గదిలో ఇరుక్కుపోయిందని అక్కడి మేధావి వర్గం తేల్చేసింది. సరిగ్గా.. ఈ సమయంలోనే బీజేపీ అప్రమత్తమైందా?

తమిళనాట కాలు మోపాలన్న సంకల్పానికి బీజేపీ ఎప్పుడో నడుంకట్టింది. ఒకవైపు అన్నాడీఎంకే శాల్తీలని అదుపులో వుంచుకుంటూనే, మరోవైపు మిగతా ద్రవిడ శక్తుల మీద కూడా కన్నేసింది బీజేపీ అధిష్టానం. ఇటు.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ని  సైతం ‘దువ్వుతూ’ వస్తోంది. రజనీ ఇంటికెళ్లి మరీ కౌగిలించుకున్న మోదీ.. ‘ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడూ కాదు’ అంటూ కన్ను గీటేశారు. జయలలిత లేని అన్నాడీఎంకే ఎన్ని ముక్కలైందో లెక్కే లేదు. అలాగే.. ఇప్పుడు కరుణానిధి లేని డీఎంకే రేపు ఎటువంటి పరిస్థితిలోకి దిగజారిపోతుందో కూడా అంచనాలకందదు. ఈ ‘అవకాశాన్ని’ సద్వినియోగం చేసుకుని అమిత్ షా మరోసారి ‘పెద్దన్న’ పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదని, నెలరోజులు తిరిగేసరికల్లా తమిళనాడు రాజకీయ చిత్రం ‘పూర్తిగా’ మారిపొయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషణలొస్తున్నాయి. సో.. ‘ఆపరేషన్ డీఎంకే’ రేపట్నుంచి మొదలవ్వొచ్చన్న మాట!

Related News