ఏపీ శాపం మోదీకి తగిలింది!

కర్నాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవతరించినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌ని దక్కించుకోలేక చతికిలబడింది బీజేపీ. మరో డజనో, అరడజనో సీట్లు దక్కివుంటే యెడ్యూరప్పకి రాజ్‌భవన్ రెడ్‌కార్పెట్ పరిచేది. ఇప్పుడు సింపుల్ మెజారిటీ లేకపోవడంతో.. గవర్నర్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. ఈ ‘దురవస్థ’కు కారణం ఏదంటే.. ఠక్కున ఏపీ సెంటిమెంట్ గుర్తుకు వస్తుంది. ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని నిలబెట్టుకోకపోవడంతో ఏపీ పాలిట సైతాన్‌లా మారింది బీజేపీ. కర్ణాటకలో బీజేపీ గెలవకూడదంటూ ఇక్కడి, అక్కడి తెలుగు జనాభా మొత్తం ముక్తకంఠంతో నినదించింది. ఏపీ నుంచి కొన్ని శక్తులు పనిగట్టుకునిమరీ కర్ణాటక వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసివచ్చాయి. ఏపీ ప్రజల శాపం ఫలించినా ఫలించవచ్చన్న ఆందోళన సైతం బీజేపీ శ్రేణుల్లో కనిపించింది. తీరా ఎన్నికలు ముగిసి.. ఫలితం వచ్చాక దాని ఎఫెక్ట్ కూడా కనిపిస్తోందంటూ సోషల్ మీడియా బీజేపీని తిట్టిపోస్తోంది.

నోటి దాకా వచ్చిన అన్నం ముద్ద.. గొంతులోకి చేరే మార్గం లేక.. దిక్కుతోచని పరిస్థితిలో పడింది కన్నడ బీజేపీ. కర్ణాటక జనాభాలో దాదాపు 10 శాతం.. 40 లక్షల వరకూ తెలుగువాళ్లున్నారన్నది ఒక అంచనా. వీళ్ళలో కొంత పర్సెంటేజ్ అయినా తమను దూరం పెట్టివుండొచ్చని బీజేపీ కూడా అనుమానిస్తోంది. తెలుగు ఓటర్లు అత్యధికంగావున్న నియోజకవర్గాలు 64 అయితే.. వాటిలో 31 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బీజేపీ గెలిచింది కేవలం 18 స్థానాలు కాగా, జేడీఎస్-13 సీట్లు దక్కించుకుంది. రాయచూర్ జిల్లాలో ఏడింటికి రెండు గెలిస్తే.. ఐదు సెగ్మెంట్లున్న కొప్పల్ జిల్లాలో మూడింటిని, 9 సీట్లున్న బళ్లారిలో 3 మాత్రమే బీజేపీ చేజిక్కించుకుంది. చిక్‌బళ్లాపూర్, కోలార్ జిల్లాల్లో తెలుగోడి ఆగ్రహానికి కమలం ఖాతా తెరవలేదు. కోలార్ జిల్లాలోని ఆరు సీట్లలో కాంగ్రెస్-4, జేడీఎస్-1, ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. చిక్‌బళ్లాపూర్ విషయానికొస్తే… ఇక్కడ 5 సీట్లలో కాంగ్రెస్-4, జేడీఎస్-1 సొంతం చేసుకున్నాయి. బీదర్ జిల్లాకొస్తే.. తెలుగు ఓటర్లు ప్రభావితమయ్యే మూడు స్థానాల్లో కాంగ్రెస్-2, జేడీఎస్-1 దక్కించుకున్నాయి.  బాగేపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి నటుడు సాయికుమార్‌ ఘోరంగా ఓడిపోయారు. కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో అంచనాలకు మించి ఓట్లు, సీట్లు సాధించిన కమలనాధులు, తెలుగువాళ్లు అధికంగా వుండే ప్రాంతాల్లో సీట్లు గెలవలేకపోయింది. బెంగుళూరు నగరం పరిధిలోని మొత్తం 27 నియోజకవర్గాలుండగా, తెలుగువారి ప్రభావం వుండే 15 సీట్లలో కాంగ్రెస్-7, బీజేపీ-6, జేడీఎస్-1 స్థానాలను గెలుచుకున్నాయి. బెంగుళూరు గ్రామీణ పరిధిలో తెలుగువాళ్ల ప్రభావం వున్న 4 స్థానాల్లో బీజేపీ ఒక్కటీ కూడా దక్కించుకోలేదు. అందులో జేడీఎస్-3, కాంగ్రెస్-1 సొంతం చేసుకున్నాయి. మొత్తమ్మీద తెలుగు ప్రాబల్యం వున్న ప్రాంతాల్లో బీజేపీకి సీట్లు గణనీయంగా తగ్గినట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేసి ఉంటే బీజేపీకి కనీసం మరో 20 స్థానాలు వచ్చి ఉండేవని.. ఈ మేజిక్ ఫిగర్ తంటా తప్పివుండేదని కామెంట్లు పడిపోతున్నాయి.

READ ALSO

Related News