నన్ను కట్ చేస్తే..ఏపీనే కట్ చేస్తా-మంత్రి మాణిక్యాలరావు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ- బీజేపీల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలపై దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు మండిపడ్డారు. తాను ప్రశ్నిస్తే చాలామందికి బాధ కలుగుతుందని, నన్ను నిలదీసే పరిస్థితి వస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తానని హెచ్చరించారు. తనను కట్ చేయాలని చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌నే కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. సహనానికి హద్దులుంటాయని, మూడున్నరేళ్లు సహనంతోవున్నానని, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కలిసి పని చేస్తున్నామని గుర్తుచేశారు ఆయన.

తాడేపల్లిగూడెం మండలంలోని రామన్నగూడెంలో బుధవారం జన్మభూమి సభ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి, నియోజకవర్గంలో తనను అంటరానివాడిగా చూస్తున్నారని, స్థానికంగా జరిగే కార్యక్రమాలకు తనను టీడీపీ నేతలు ఆహ్వానించలేదని, తానేమైనా శత్రువునా? కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదా? అంటూ ఆందోళన వ్యక్తంచేశారు. పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుపై మంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గాన్ని కేంద్రం నిధులతోనే అభివృద్ధి చేశానని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని, అడ్డుకోవాలని చూస్తే రెచ్చిపోతానని మండిపడ్డారు.

Related News