పోరాటం కేంద్రంపై..నిరసనలు ఢిల్లీలో తెలపండి: బాబు

ఏపీ బంద్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వివిధ పార్టీలకు, సంఘాలకు, అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న మన పోరాటం కేంద్రంపైనని… మన నిరసనలు ఢిల్లీలో తెలపాలన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది.. మరింత ఇబ్బందులకు గురిచేయొద్దని బంద్ కు మద్దతుతెలిపిన పార్టీలకు, సంఘాలకు చంద్రబాబు సూచించారు. నిరసనలు వినూత్నంగా జరపాలని, అరగంట సేపు నిరసనలు తెలుపుదాం.. గంటసేపు ఎక్కువ పనిచేద్దాం.. రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. బంద్‌ ప్రశాంతంగా జరిగేలా చూడాలని బాబు అధికారులను ఆదేశించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

నిరసనలు శాంతియుతంగా తెలియజేయాలని వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలను చంద్రబాబు కోరారు. జనజీవనానికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అరాచకశక్తులు బంద్‌లో చొరబడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏపీ బంద్‌పై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, పోలీసు, ఆర్టీసీ, సీఎం పేషీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిఘా పెట్టాలని సీఎం పేర్కొన్నారు. ఇది సున్నితమైన అంశమని.. మన నిరసన సున్నితంగానే ఉండాలని బాబు అన్నారు. పోలీసు, ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సమన్వయంగా పనిచేయాలని.. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.

Related News