ఏపీలో జోరుగా బంద్.. టీడీపీ, బీజేపీ దూరం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఇవాళ ఏపీ బంద్‌ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్రం వైఖరికి నిరసనగా హోదా సాధన సమితి బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు టీడీపీ, బీజేపీ మినహా రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు సోమవారం తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌ ఎదుట వామపక్షాలు ఆందోళనకు దిగడంతో భారీగా బస్సులు నిలిచిపోయాయి. ఈ ఆందోళనలో సిపిఎం నేత మధు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఏపీలోని 13జిల్లాల్లోవామపక్ష, వైసీపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా, ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

కడప ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట వైసీపీ కార్యకర్తల ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ఉదయం నుంచే విపక్షాలు ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటూ బంద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

Related News