అట్నుంచి నరుక్కొస్తున్న కత్తి.. పవన్‌కి మళ్ళీ ‘వార్నింగ్’

మహేష్ కత్తి పదునెంత? అతడి సామాజిక వర్గమేంటి? అతడి వెనుకుందంటున్న పొలిటికల్ పార్టీ రంగేంటి? లాంటి ప్రశ్నలన్నీ నాలుగు నెలల నుంచీ సోషల్ మీడియాలో నలుగుతున్నాయి. పవర్ స్టార్ తోనే పెట్టుకున్నాడంటే.. అతడి ధీమా వెనుక ఒక అజ్ఞాత శక్తి వుండేవుంటుందన్న సందేహం కూడా బాగా వైరల్ అయ్యింది. అతడి వ్యూహాలు, వాటి వెనకుండే సమీకరణాలు పక్కకుపెట్టి.. వాస్తవంలోకొచ్చేద్దాం. మహేష్ కత్తికి మద్దతుగా ఓయూ జేఏసీ నేతృత్వంలో శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్ లో ప్రత్యేక సమావేశం జరిగింది. మహేష్ కత్తి సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు కూడా జరిగాయి. ఇక్కడ హాజరైన కొన్ని విద్యార్థి సంఘాలు మహేష్ కత్తికి బాసటగా నిలబడ్డాయి. ‘కత్తి మహేష్‌పై దాడి జరిగితే చూస్తూ ఊరుకోం. పవన్‌ కళ్యాణ్ ని తెలంగాణలో తిరగనివ్వబోం.. ఆయన సినిమాల్ని కూడా ఇక్కడ అడనివ్వం’ అన్నది ఓయూ జేఏసీ హెచ్చరిక.

ఇటీవల కేసీఆర్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్ తీరుని కొందరు తెలంగాణవాదులు దుయ్యబట్టేశారు. తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు సైతం పవర్ స్టార్ ని బహిరంగంగానే విమర్శించాయి. మొన్నటివరకూ వైసీపీ సపోర్ట్ తోనే కత్తి మహేష్ రెచ్చిపోతున్నాడంటూ పవన్ ఫ్యాన్సే సర్టిఫై చేశారు. ఇప్పుడు ఉస్మానియా జేఏసీ పుష్పగుచ్చం ఇచ్చిమరీ కత్తికి పదును పెంచేసింది. ‘యాంటీ పవన్ కళ్యాణ్’ గ్రూప్స్ అన్నీ ఒక్కటొక్కటిగా కత్తి పక్కనొచ్చి నిలబడ్డం తాజా ఆసక్తికర పరిణామం. ‘మనం మాట్లాడి అతడ్ని పెద్దోడ్ని చెయ్యొద్దు’ అంటూ పవన్ కళ్యాణ్.. తన ఫ్యాన్స్ తో అన్నట్లు వార్తలొచ్చాయి. కానీ.. తను మాట్లాడకుండానే కత్తికి పదును పెంచుతున్నాడన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. పైగా.. పండగ సినిమా ఎండిపోయిన ఈ సీజన్లో పవన్ కళ్యాణ్ మాటకు కాస్త ‘బరువు’ తగ్గిందన్న అంచనా ఒకటుంది. కనుమకల్లా క్లారిటీకి రావాలంటూ కోనా వెంకట్ హెచ్చరించిన నేపథ్యంలో.. కత్తి కార్యాచరణ ఏమిటన్న సస్పెన్స్ అంతకంతకూ పెరిగిపోతోంది.

Related News