ప్రపంచ శాంతి కపోతం ఎగురుతోంది

ప్రపంచ శాంతి కపోతం హాయిగా విహరించేందుకు రంగం సిద్ధమౌతోంది. అంతర్జాతీయ మీడియా ఊహించినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ – ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ భేటీకి తేదీ, వేదిక ఖరారయ్యాయి. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కు తనకు మధ్య అత్యంత కీలమైన భేటీ సింగపూర్ లో జూన్ 12వతేదీన జరుగుబోతోందని సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంపే వెల్లడించారు. తామిద్దరం కలిసి ప్రపంచ శాంతికి ఒక స్పెషల్ మూమెంట్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని కూడా ట్రంప్ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు.

కిమ్ తో సమావేశానికి సంబంధించిన తేది, వేదిక ఖరారైందని ఇటీవలే ట్రంప్ ప్రకటించడంతో వీరి భేటీ గురించి ఇంటర్నేషనల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగానే అమెరికా అధ్యక్షుడితో కూడ తాను చర్చలు జరిపేందుకు సిద్దమని కిమ్ ప్రకటించి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు. దీంతో కిమ్‌తో చర్చలకు తాను కూడ సిద్దమని అమెరికా వెంటనే ప్రకటించింది.

ఇప్పుడు ఇరు దేశాధినేతల మధ్య సమావేశానికి రంగం సిద్దమైంది. ఇదిలాఉంటే, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఈ ఏడాది ఆరంభం నుండి శాంతి మార్గాన్ని అనుసరిస్తున్నారు. కొత్త సంవత్సర వేడుకల్లో ఇకపై అణు, క్షిపణి పరీక్షలు జరపబోమని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాదు, దక్షిణకొరియా అధినేతతో ఇప్పుడు ట్రంప్ తో సమావేశాలకు శ్రీకారం చుట్టి కొత్త ఉత్తరకొరియాని సాక్షాత్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

Related News