వర్మ ఇస్తానన్న ఆ ఐదు కోట్లు ఎవ్వరివి..? ఎక్కడివి?

సెలబ్రిటీల్ని చీల్చి చెండాడ్డమే పనిగా పెట్టుకున్న శ్రీరెడ్డి ఇష్యూని ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ హైజాక్ చేసినట్లయింది. క్యాస్టింగ్ కౌచ్ రుగ్మత నుంచి తెలుగు ఇండస్ట్రీని కాపాడాలన్న నినాదం కాస్తా.. మెగా ఫ్యామిలీని కార్నర్ చేసింది. పవన్‌కళ్యాణ్ మీద బూతులందుకున్న శ్రీరెడ్డి వెనుక ఎవరున్నారో తేలిపోయేసరికి.. ఇక అటోఇటో తేల్చుకుందామని డిసైడైంది మెగా ఫ్యామిలీ. బుధవారం నాడు నాగబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఒక మోస్తరుగా కడిగేశాడు. ఇప్పుడు వర్మ పేరు వెలుగులోకొచ్చింది కనుక.. మరింత తీవ్రంగా దాడి చేయాలని మెగా‌క్యాంప్ డిసైడైంది. వర్మ చేష్టల్ని ఎండగట్టడమే ఎజెండాగా మీడియా ముందుకొచ్చేశాడు మెగా బావ అల్లు అరవింద్.

 

నా టార్గెట్ రామ్ గోపాల్ వర్మ మాత్రమేనంటూ మొదలుపెట్టిన అరవింద్.. అదే దూకుడు కొనసాగించారు. వర్మ రిలీజ్ చేసిన వీడియో చూసిన తర్వాత తన రక్తం ఉడికిపోతోందన్నారు. శ్రీరెడ్డిని పవన్ కళ్యాణ్ మీదికి పురికొల్పింది, అసభ్య పదజాలం ఉపయోగించేలా రెచ్చగొట్టింది తానేనన్న వర్మ లాంటి నికృష్టుడ్ని ఉపేక్షించడం కుదరదన్నారు. దగ్గుబాటి సురేష్ బాబు ఫ్యామిలీ తరఫున మధ్యవర్తిత్వం వహిస్తూ ఐదు కొట్లతో సెటిల్మెంట్ చెయ్యబోయ్యాననడం పచ్చి బూటకమన్నారు. సురేష్ బాబుతో తాను మాట్లాడానన్న అల్లుఅరవింద్.. వర్మ చెప్పిందంతా కట్టు కథ అని.. అసలు కథ వేరే ఉందని అనుమానించారు. వర్మ ఇస్తానన్న ఆ ఐదు కోట్లు ఎవ్వరివి.. ఎక్కడివో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయత్నాల్ని భ్రష్టు పట్టించడం కోసం ఎవరో వెనకనుంచి వర్మతో ఈ ‘ఐదుకోట్ల’ డ్రామా ఆడిస్తున్నారన్నది ఆయన సందేహం.

 

”ఫ్యామిలీ షేడ్ పడకుండా.. పాలిటిక్స్ నడుపుదామన్న పవన్ కళ్యాణ్ ఆశయాన్ని గౌరవిస్తూ మేమందరం దూరంగా వున్నాం. కానీ.. కానీ పరిస్థితులు మమ్మల్నలా ఉండవివ్వడం లేదు. ప్రజారాజ్యం సమయంలో ఇటువంటి కుట్రలు చాలా చూశాం. ఇప్పుడు పవన్ మీద కూడా అటువంటి కుట్రలే చేస్తున్నారు.. ” అంటూ జాగ్రత్త వుండాలనిగా పవన్ కళ్యాణ్‌ని హెచ్చరించారు అల్లు అరవింద్. పవన్ కళ్యాణ్ మీదున్న పాత కోపాన్ని తీర్చుకోడానికి ‘సురేష్ బాబు ఫ్యామిలీ’ని అడ్డం పెట్టుకోవడం వర్మ పాల్పడ్డ నికృష్ట చర్య అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. తనకు పుట్టుకనిచ్చిన సినిమా పరిశ్రమను భ్రష్టు పట్టించడానికి వర్మ చేసే ప్రతి ప్రయత్నాన్ని భరిస్తూ వస్తున్నామన్నారు. తల్లి రొమ్ము గుద్దిన వర్మ అనే ఈ నీచుడ్ని శిక్షిస్తారా.. వదిలేస్తారా అనేది మీడియాకు, మెగా ఫ్యాన్స్ కి, ఫిలిం ఇండస్ట్రీకి వదిలేస్తున్నానన్నారు. వర్మ సినిమాల్ని తెలుగులో విడుదల కాకుండా నిషేధం విధించే దిశగా.. అల్లు అరవింద్ లాబీయింగ్ మొదలుపెట్టేశారు కూడా. కానీ.. సాంకేతికంగా అటువంటి ప్రయత్నం ఫలించబోదని ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి.

Related News